ఏపీ ప్రజా వేదిక శిధిలాలు అలాగే..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టగానే కూల్చివేసిన ప్రజా వేదిక శిధిలాలు అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-06-16 02:36 GMT

గత ఐదేళ్ల పాలనలో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన కొన్ని భవనాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం వంటివి పనికి రాకుండా పోయాయి. మూడు రాజధానుల నినాదంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా వదిలేసింది. దీంతో అప్పటికే ఖర్చుచేసిన కొన్ని వేల కోట్లు మట్టిపాలయ్యాయి.

విధ్వంసానికి సాక్ష్యంగా ప్రజావేదిక
2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న ప్రజావేదికను కూల్చి వేయడం. విధ్వసం అనేది ఇక్కడే మొదలైంది. కృష్ణా నదిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చి వేస్తామన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ తరువాత ఊసే ఎత్తలేదు. ప్రజావేదిక కూల్చి వేతతోనే ఆపేసింది. ప్రజావేదిక భవనాన్ని కూల్చి వేసిన అధికారులు ఆ భవనానికి సంబంధించిన మెటీరియల్‌ను అక్కడి నుంచి తరలించలేదు. కూలగొట్టి అలాగే వదిలేశారు. ఇప్పుడు ఆ శిధిలాలు తెలుగుదేశం ప్రభుత్వానికి వరంగా మారాయి. చంద్రబాబుపై కక్ష తీర్చుకునేందుకు ప్రజావేదికను కూల్చివేసిన జగన్‌ అది నిర్మించింది ప్రజాధనంతోననే విషయాన్ని మరిచిపోయారు.
అధికారం చేపట్టగానే ఎందుకు కూల్చేశారు..
అప్పటి వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ వారికి ఎక్కడికక్కడ చెక్‌ పెట్టాలని వైఎస్‌ జగన్‌ భావించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ ప్రజావేదిక ప్రతిపక్ష నాయకుడి ఇంటి పక్కన ఉన్నందున దానిని ప్రతిపక్ష నేతకు కేటాయిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉపయోగించుకుంటారని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వైఎస్‌ జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ప్రజావేదికను కూలగొట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టారు. అప్పటి వరకు కలెక్టర్‌లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హెచ్‌వోడీల సమీక్ష సమావేశాలు ఇక్కడే జరిగేవి. ఈ వ్యవహారాన్ని చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు.
ప్రజావేదిక ఉండి ఉంటే బాగుండేది..
నాడు నిర్మించిన ప్రజా వేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ గత ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చి వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. ప్రజా వేదిక ప్రాంతాన్ని ఏం చేస్తారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విధ్వంస పాలనకు ప్రతీకగా దాన్ని అలాగే ఉంచుతాము. ఆ శిథిలాలను తొలగించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, నష్టాన్ని.. కూల్చివేయబడిన ఆ ప్రజా వేదిక ఎప్పటికీ చాటి చెపుతుందని సిఎం అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైంది ప్రజా వేదిక కూల్చి వేత ద్వారానే కాబట్టి... దాన్ని ఒక చిహ్నంగా ఉంచుతాం అని చంద్రబాబునాచయుడు అనటం విశేషం.
హైదరాబాద్‌లో జగన్‌ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టు కూల్చివేత..
ఎవరికి ఎవరూ తీసి పోరని తెలంగాణలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నిరూపించింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ నివాసం ముందు సెక్యూరిటీ ఉండటం కోసం నిర్మించిన పోస్ట్‌ను తెలంగాణ అధికారులు శనివారం కూల్చి వేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్డుపై సెక్యూరిటీ పోస్టు నిర్మించారని, దీనిని తొలగించాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, అందుకే తొలగించామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపై ప్రజలు నడిచే అవకాశం లేదా..
ఏపీలోని తాడేపల్లిలో నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ప్రభుత్వ ధనంతో రోడ్లు నిర్మించారని, కాలువ కట్టకు ఆనుకుని నిర్మించిన 1.5 కిలోమీటర్ల రోడ్డును ప్రభుత్వ ధనంతో నిర్మించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోడ్డుపై ప్రజలు నడవకుండా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ఐదేళ్లుగా అక్కడి ప్రజలను సెక్యూరిటీ వారు ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం ప్రభుత్వం తెలిపింది. దీనిపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై టీడీపీ ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. ప్రస్తుతం మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ అంతా ప్రభుత్వ డబ్బుతో కొనుగోలు చేసిందేనని, ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్సార్‌ సీపీ అధినేత ఇంట్లో ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నీచర్‌ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
Tags:    

Similar News