జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో పరకామణి చోరీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

పరకామణి చోరీ మామూలు దొంగతనం కాదన్న ఏపీ హైకోర్టు

Update: 2025-12-16 11:49 GMT
టీటీడీ పరకామణి చోరీ కేసుపై (TTD Parakamani Theft Case) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) మంగళవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగే చోరీలను మామూలు దొంగతనంగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది.

కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీకి గురయితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టు తెలిపింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకీకరించాల్సిన అవసరముందని వెల్లడించింది. మానవ ప్రమేయాన్ని తగ్గించి.. యంత్రాలు, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించింది. టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరుగుతున్నా కానుకలు లెక్కించేందుకు అదే పాత విధానాన్ని అనుసరించడం సరికాదని స్పష్టం చేసింది.
పరకామణిలో జరిగిన నేరం.. దొంగతనం కంటే పెద్దదని పేర్కొంది. ‘‘భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి బాధ్యత ఉండదు. టీడీడీలో ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు సరికాదు. విరాళాల లెక్కింపు వద్ద టేబుళ్లు ఏర్పాటు చేయాలి. లెక్కింపు కోసం భక్తులను ఎందుకు తీసుకోకూడదు? టీటీడీ నిర్వహణలో ఏఐని ఉపయోగించాలి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కానుకల లెక్కింపునకు సేవాభావంతో వచ్చిన భక్తులను దుస్తులు లేకుండా సోదాలు చేయడం, దొంగల్లా అవమానించడం తగదని పేర్కొంది. కానుకలు లెక్కింపునకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ క్రమంలోనే ఇరుపక్షాల న్యాయవాదులకు ఏపీ హైకోర్టు పలు సూచనలు చేసింది. కేసును వాయిదా వేసింది.

పరకామణి చోరీ చాలా చిన్న వ్యవహారమంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పరకామణిలో జరిగిన చోరీ చాలా చాలా చిన్నదని అంటూ.. ఆ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకని జగన్ ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు. పరకామణి లో రవికుమార్ అనే వ్యక్తి ఏదో చిన్న దొంగతనం చేశాడు.. కానీ అందుకు ప్రాయశ్చితంగా టీటీడీకి 14.4 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడంటూ జగన్ వెనకేసుకు వచ్చారు. అటు వంటి వ్యక్తి విషయంలో ఇంత యాగీ చేస్తారేంటంటూ ఆశ్చర్యపోయారు.
పరకామణి చోరీపై ఫిర్యాదు చేసిన సతీష్ హత్యకు గురి కావడంతో పరకామణి చోరీ వ్యవహారంలో రవికుమార్ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.
ఇదిలా ఉంటే కోర్టు కూడా పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇదేమీ చిన్న విషయం కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను డిసెంబర్ 4 విచారించిన ధర్మాసనం సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
తిరుమల శ్రీవారి పరకామణి చోరీని ‘చిన్న దొంగతనం’గా అభివర్ణిస్తూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, జగన్‌కు దేవుడన్నా, భక్తులన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్కలేదని మండిపడ్డారు.
“బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి, ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించాడు కదా, తప్పేముందని జగన్ వాదించడం అనైతికమని అన్నారు.
Tags:    

Similar News