మహానటిని తలపించిన మునెమ్మ 'బందీనాటకం'
కొడుకును అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-14 16:37 GMT
పొలాల మధ్య ఉన్న విద్యుత్ స్తంభానికి స్వయానకొడుకే తల్లిని కట్టేశాడు. ఆమె పెడబొబ్బలు పడుతుంటే, ఆ వీడియో రికార్డ్ చేశాడు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కార్ల గట్ట గ్రామంలో జరిగిన ఈ సంఘటన వీడియో వైరల్ అయింది.
ఆస్తికోసం తల్లి కొడుకు ఆడిన ఈ హై డ్రామా వికటించింది. పోలీసుల దర్యాప్తులో తల్లి,కొడుకు ఆడిన వింత నాటకం పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళను కట్టేసిన విద్యుత్ స్తంభానికి సమీపంలోనే పొలాల్లో పనిచేసుకుంటున్న వారు కూడా ఆ మహిళను శాపనార్థాలు పెడుతుండడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
"నీకున్నది ఒకే కొడుకు. ఎందుకు ఈ కథలన్నీ" అని బుద్ధి మాటలు చెప్పడం వినిపించింది.
ఈ ఏడాది జూన్ 18వ తేదీ కుప్పం లో ఓ అమానవీయ సంఘటన జరిగింది. అప్పులు చేసిన భర్త కనిపించకుండా పోయాడు. ఆయన భార్యను చెట్టుకు కట్టేసి అప్పు ఇచ్చిన వారు వేధించిన విషయం తెలిసిందే.
కుప్పం మండలం నారాయణపురం గ్రామం వద్ద జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. గంటల వ్యవధిలోనే సీఎం ఎన్ చంద్రబాబు స్పందించి బాధిత మహిళ, ఆమె పిల్లల చదువులకు సాయం అందించారు. ఈ సంఘటన నేపథ్యంలో..
వికటించిన నాటకం
కుటుంబంలో ఆస్తి గొడవలను ఆసరాగా చేసుకుని ఓ తల్లి కొడుకు ఆడిన వింత నాటకం వికటించింది. ఆ వివరాలు పరిశీలిస్తే
శాంతిపురం మండలం గార్లగట్ట గ్రామం మునెయ్యకు మునెమ్మ, గంగమ్మ భార్యలు. మునయ్య ఇటీవల మరణించాడు.
ఆదివారం అంటే ఈనెల 13వ తేదీ ఆయన కర్మకాండ లో కూడా పూర్తి చేశారు. మునయ్య చనిపోయిన నాటి నుంచి వారి రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం సాగుతున్నట్టు తెలుస్తుంది. వారికి ఎంత పొలం ఉందో తెలియదు గానీ ఒకరిని మించి మరొకరు ఆస్తి కోసం పోటీ పడుతున్నట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది.
ఆస్తి ఎక్కువ తీసుకోవాలని భావించారేమో సురేష్ తన తల్లి మునెమ్మతో కలిసి ఓ ఆలోచన చేశాడు. మెదడులోకి ఆ ఆలోచన రాగానే..
తల్లి మునెమ్మను గ్రామ సమీపంలో ఉన్న పొలం లోకి తీసుకువెళ్లాడు. అక్కడున్న విద్యుత్ స్తంభానికి మునెమ్మను కట్టేశాడు. ఆమె శోకాలు పెడుతుంటే వీడియో రికార్డు చేశాడు.
"నాకు ఆస్తి ఇచ్చి కాపాడండి. సవితి పోరుతో ఇబ్బంది కలుగుతోంది" అంటూ మునెమ్మ శోకాలు తీస్తుంటే ఆమె కొడుకు సురేష్ వీడియో రికార్డ్ చేశాడు.
సమీపంలో కులాల వద్ద పనిచేసుకుంటున్నా మహిళ వీడియోలో కనిపించని ఓ వ్యక్తి మునెమ్మను మందలిస్తూ ఉండడం వినిపించింది.
"నీకు ఉన్నది ఒకే కొడుకు. అప్పుడు లేవు,సమస్యలు లేవు. ఎందుకు ఇలా చేస్తున్నావ్" అని మందలించడం వినిపించింది.
కుప్పంలో నెల క్రిందట ఓ మహిళను కట్టేసిన సంఘటన తరహాలోనే తాజాగా శాంతిపురం మండలంలో మహిళను కట్టేసి ఉన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో వెంటనే రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం వింత నాటకం ఆడాలని గ్రహించిన పోలీసులు మునెమ్మ కొడుకు సురేష్ ను అరెస్ట్ చేశారు.
కుప్పం నుంచి సీఎం ఎన్ చంద్రబాబు సారథ్యం వహిస్తుండడంతో గత సంఘటన నేపథ్యంలో నాటకం ఆడితే మేలు జరుగుతుందని భావించిన తల్లి కొడుకు కష్టాలు కొని తెచ్చుకున్నారు.