EXCLUSIVE | శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఒకే చైర్మన్

2003లో ఏమి జరిగింది? చలపతిరావుకు అవకాశం ఎలా దక్కింది?

Update: 2025-09-24 14:47 GMT
తిరుమల శ్రీావారి ఆలయం

తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న పట్టువస్త్రాలు సంప్రదాయానికి టీటీడీ చరిత్రలో ఒకేసారి బ్రేక్ పడింది. 2003లో అలిపిరి వద్ద క్లెమోర్ మైన్లు పేలిన ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దేవానుగ్రహం ఉండడం వల్లే ప్రాణాపాయం నుంచి బయటపడగలిగానని సీఎం నారా చంద్రబాబు ఆ సంఘటన ప్రస్తావించిన ప్రతిసారి చేసే వ్యాఖ్య అది.

టీడీపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ సీఎం ఎన్టీరామారావు పట్టువస్త్రాలు సమర్పించే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా భద్రచలంలో రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఉండేది.
"తెలుగుకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీరారావు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే పద్ధతిని తిరుమలలో అమలు చేశారు" అని తిరుపతిలోని సీనియర్ జర్నలిస్టు రవికుమార్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయం పక్కకు ఉంచితే..

అక్టోబర్ ఒకటో తేదీ తిరుపతిలో ఏమి జరిగింది? తిరుమలలో ఆ నాటి టీటీడీ చైర్మన్, అధికారుల పరిస్థితి ఏమిటి? హైదరాబాద్ లో నేనేమి విన్నానంటే..
ఓ జాతీయ తెలుగు దినపత్రికలో మదనపల్లె డివిజన్ స్టాఫ్ రిపోర్టర్ గా నేను, పీలేరు నుంచి జాకీర్ హుస్సేన్, చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్ మన్నెం చంద్రశేఖరనాయుడుతో కలిసి సెప్టెంబర్ 30వ తేదీ హైదరాబాద్ లో ఆ పత్రిక చైర్మన్ మీటింగ్ కు వెళ్లాం. మరుసటి రోజు అంటే, అక్బోబర్ ఒకటో తేదీ సాయంత్రం మేమంతా కలిసి లక్డీకాపూల్ వద్ద పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఇరానీ హెటల్ బిర్యానీ బాగుంటుందని నేను వారందరినీ  తీసుకుని వెళ్లి,  భోజనం చేస్తున్నాం. మదనపల్లె నుంచి టీడీపీ నేత పులి మోహన్ నుంచి ఫోన్ వచ్చింది.
"భాస్కర్ సార్, చంద్రన్నపై బాంబులేశారంట. ఇంతకీ ఏమి జరిగింది" అనేది ఆందోళనతో కూడిన సందేహం.
నేను వెంటనే అప్పటి మదనపల్లె వన్ టౌన్ ఎస్ఐ (ఏసీబీ డీఎస్పీ హోదాలో రెండేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు) వల్లూరు అల్లాబక్ష్ కు కాల్ చేశా.
"యోవ్.. సీఎం గారు స్విమ్స్ లో ప్రారంభోత్సవాలు చేసి, తిరుమల బయల్దేరారు. అలిపిరి దగ్గర పేలుడు వచ్చింది. గాయాలతో ఉన్న సీఎం చంద్రబాబును స్విమ్స్ ఆస్పత్రికి తీసుకుని వస్తున్నారు" అనేది ఆందోళన స్వరంతో చెప్పి, మరోమాటకు ఆస్కారం లేకుండా ఫోన్ కట్ చేశారు.
కాసేటికే లంచ్ పూర్తి చేసిన  మా రిపోర్టర్ల బృందం హైదరాబాద్ నుంచి మదనపల్లెకు తిరుగు ప్రయాణం అయ్యాం. ఇమ్లిబన్ సెంట్రల్ బస్ స్టేషన్ కు చేరుకున్నాం. రద్దీ ఎక్కువగా ఉంది. కష్టపడి బస్సు ఎక్కాం. మేము జర్నలిస్టులం అని తెలియగానే బస్సులో వారందరికే కాదు. హైదరాబాద్ రిపోర్టర్ల నుంచి తామరతంపరగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా పరిస్థితి ఇలా ఉంటే..
తిరుమలలో ఉద్విజ్ణం

సీఎం నారా చంద్రబాబుతో పప్పల చలపతిరావు (ఫైల్)

తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. భద్రత కట్టుదిట్టంగా ఉంది. పద్మావతి అతిథిగృహాల సముదాయంలో సీఎం నారా చంద్రబాబు విడిది చేయడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం చెంత బందోబస్తు, టీటీడీ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. సీఎం రాకకోసం ఆనాటి టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు తోపాటు టీడీపీ నేతలు అంతా నిరీక్షిస్తున్నారు. సాయంత్రమైంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సంబురానికి ధ్వజారోహణం చేసే గడువు సమీపిస్తోంది. అంతా హడావిడిగా ఉంది. అదే సమయంలో పిడుగులాంటి సమాచారం తిరుమలలో కూడా దావానలంలా వ్యాపించింది.
అదే సమయంలో తిరుమలలో ఉన్న వార్త సీనియర్ స్టాప్ రిపోర్టర్ రవికుమార్ ను మేము హైదరాబాద్ నుంచి సంప్రదించాలని ప్రయత్నిస్తే, జామర్లు, సెల్ ఫోన్ ఎయిర్ ట్రాఫిక్ పెరగడం వల్ల లైన్ కలవలేదు. ఎట్టకేలకు మన్నెం చంద్రశేఖర్ కు కాల్ కలిస్తే,
"అయ్యో సామీ ఇప్పడేమి మాట్లాడలేం. పరిస్థితి వేరుగా ఉంది" అని రవికుమార్ కాల్ కట్ చేశారు. తిరుమలకు పాకిన వార్తల్లో..
"అలిపిరి వద్ద సీఎం నారా చంద్రబాబు కాన్వాయ్ పై బాంబులు పేలాయి" అనేది ఆ సమాచారం సారాంశం. టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. శ్రీవారి బ్రహ్మోత్సవ ధ్వజారోహణకు నిర్ణీత ముహూర్తం సమీపిస్తోంది.ఆగమశాస్త్రం ప్రకారం సమాయానికి ఈ క్రతువు నిర్వహించాలనేది టీటీడీ పండితులు హడివుడి పడుతున్నారు.
బాంబుల దాడిలో సీఎం నారా చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చదవలవాడ కృష్ణమూర్తి (తిరుపతి) రెడ్డివారి రాజశేఖరరెడ్డి (పుత్తూరు). శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రి, ఆ తరువాత స్విమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు కూడా తిరుమలకు సమాచారం అందింది.
ఈ సంఘటనతో

తిరుపతి నగరం అలిపిరి వద్ద సీఎం నారా చంద్రబాబుపై బాంబు దాడి ఘటన నేపథ్యంలో ఆయన పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో 2003-2004 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత పప్పల చలపతిరావుకు ఆ అపూర్వ అవకాశం దక్కింది.
"తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి వద్ద చలపతిరావుకు ఆలయ మర్యాదలతో సిద్ధం చేశారు. వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ఉంచి, చలపతిరావు తలపై ఉంచారు. అక్కడి నుంచి ఆలయం వరకు తీసుకుని వెళ్లిన వేదపండితులు ఆ కార్యక్రమం అలా పూర్తి చేశారు" అని సీనియర్ జర్నలిస్టు రవికుమార్ ఆ నాటి అనుభవాన్ని పంచుకున్నారు.

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి ఆయన ఎంఎల్సీగా 2015లో ఎమ్మెల్సీగా పనిచేసిన పప్పల చలపతిరావు, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. హౌసింగ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేసిన టీడీపీ నేత చలపతిరావు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కింది.


Tags:    

Similar News