పేర్ని నాని మీద కేసు వాయిదా
రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.;
మాజీ మంత్రి పేర్ని నాని కేసుకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఇది వరకు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 8వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఉన్నత న్యాయం స్థానం తదుపరి విచారణను జనవరి7కు వాయిదా వేసింది. పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో నిర్వహిస్తున్న సొంత గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిని కూడా నిందితుడిగా చేర్చారు. పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయమయ్యాయనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నానిని ఏ6గా చేర్చుతూ మచిలీపట్నం తాలూకాలోని రాబిన్‌సన్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై పేర్ని నాని ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుపైన సోమవారం విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటీషనర్ పేర్ని నానిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మంధ్యతర ఉత్తర్వులను జనవరి 8 వరకు పొడిగించింది.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తమ గోడౌన్‌లో కూడా రేషన్ బియ్యం మాయమయ్యాయని, దీనిపై విచారణ జరపాలని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేర్ని నాని లేఖ రాశారు. దీంతో రేషన్ బియ్యం మాయమైన ఘటన వెలుగు చూసింది. దీనిపై స్పందించిన మచిలీపట్నం పౌరసరఫరాల శాఖ అధికారులు డిసెంబరులో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. మాయమైన బియ్యానికి రూ. 3.35 కోట్లు జరిమానా చెల్లించారు.
దీంతో గోడౌన్ పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై ఉండటంతో ఆమె మీద డిసెంబరు౧౦న కేసు నమోదు చేశారు. తర్వాత గోడౌన్ మేనేజర్ మానస తేజను, తనిఖీలు చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఏ2గా మానస తేజను, ఏ3గా కోటిరెడ్డిని, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులును అరెస్టు చేసిన పోటీసులు వారిని రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో ఏ6గా పేర్ని నానిని చేర్చారు. ఏ1గా ఉన్న జయసుధకు ఇది వరకే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు జయసుధను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల పోలీసుల విచారణకు హాజరయ్యారు.
మరో వైపు కేసు నమోదైన తర్వాత పేర్ని నానితో పాటు ఆయన కుటుంబం కూడా అజ్ఞాతంలోకి వెళ్లి పోయిందనే ఆరోపణలు వినిపించాయి. పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధ, కుమారుడు పేర్ని కిట్టూలపై పోలీసులు పలు మార్లు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో వారు ఇంట్లో లేక పోవడంతో వారి ఇంటి గోడలు, డోర్‌లకు నోటీసులను అంటించారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నాని కుటుంబం వ్యవహారం మచిలీపట్నంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.