బిడ్డకు తలనీలాలు సమర్పించాలని బయలుదేరితే...
శ్రీవారి యాత్రికులను వెంటాడిన మృత్యువు. నెల్లూరు వద్ద ప్రమాదం. ముగ్గురి మృతి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-09 05:06 GMT
నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అందులో మూడేళ్ల బాలుడు తో పాటు అతని తల్లి, నానమ్మ ఉన్నారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మూడేళ్ల బిడ్డకు తిరుమల శ్రీవారి చెంత తలనీలాలు సమర్పించడానికి బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది.
పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశుని పాడుకు చెందిన ఎస్ వెంకటేశ్వర్లు, సుభాషిని దంపతుల మూడేళ్ల కుమారుడు అభినయ కృష్ణకు పుట్టు వెంట్రుకలు తీయించాలని భావించారు.. 9 మంది కలిసి తుఫాన్ (జీపు) వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరారు. అందరి లో ఆనందం పుట్టు వెంట్రుకలు తీయించే మూడేళ్ల బాలుడు అభినయ కృష్ణను ముద్దాడుతూ తిరుమల యాత్రకు బయలుదేరారు.
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు సమీపంలో శనివారం వేకువ జామున ప్రయాణిస్తుంది. మితిమీరిన వేగంతో రావడంతో పాటు ముందు వెళుతున్న లారీని జాతీయ రహదారిపై జీపు ఢీకొంది.
వేకువజాము కావడంతో వాహనంలో ఉన్న వారు నిద్రమత్తులో జోగుతున్నారు. ముందు వెళుతున్న లారీని తాము ప్రయాణిస్తున్న జీపు ఢీకొనడంతో వచ్చిన శబ్దం వల్ల ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో పడిపోయారు.
సంఘటన స్థలంలోనే ఇద్దరు మరణించారు. జీపులో ప్రయాణిస్తున్న వారిలో ఎస్ వెంకట నరసమ్మ (55), ఎస్ సుభాషిని అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరు అత్తా కోడలు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహదారులు కూడా స్పందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రులు తరలించడానికి చర్యలు తీసుకున్నారు. తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న వారిని అంబులెన్స్ లో కావలి ప్రభుత్వ తరలించారు.
తిరుమలలో తరనీలాలు సమర్పించాల్సిన అభినయ కృష్ణ (3) ఆసుపత్రిలో మరణించాడు. ఘటనా స్థలంలోనే ఈ పిల్లాడి తల్లి సుభాషిణి, నానమ్మ వెంకట నరసమ్మ కూడా ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన వారిలో వై శ్రీనివాసరావు, ఏం. రుక్మిణి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భగవంతుడా ఏమి శిక్ష
తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించాలని అనుకున్న మూడేళ్ల కొడుకు చనిపోయాడు. ఘటనా స్థలంలో భార్య చనిపోయింది. బాలుడి మృతదేహం పై పడి వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరయ్యారు. వారి వేదన చూసి ఆసుపత్రిలోని సిబ్బంది కూడా కంటతడి పెట్టారు.