రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం భావ్యమా?
డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు.
రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం భావ్యం కాదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఆదివారం తులసి రెడ్డి అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి వివిధ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు. రాజ్ భవన్ నిర్మాణం పనులు ఇంకా ప్రారంభమే కాలేదని, శాశ్వత సచివాలయ ,అసెంబ్లీ ,హైకోర్టు భవనాల నిర్మాణం పునాది దశలోనే ఉందని అన్నారు. మంత్రుల ,జడ్జీల, ఎమ్మెల్యేల ,ఎన్జీవోల భవనాలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ సొమ్ము దుబారా అవుతోంది. తెలంగాణ రాష్ట్ర శాశ్వత సచివాలయ భవనం 600 కోట్ల రూపాయలతో పూర్తి చేయగా అమరావతిలో తాత్కాలిక సచివాలయం పేరుతో 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని ,మళ్లీ ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో 4600 కోట్ల రూపాయలు కేటాయించడం దుబారా కాక మరి ఏమిటని తులసి రెడ్డి ప్రశ్నించారు.