వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం...!

Update: 2024-12-06 13:00 GMT

పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.



అమ్మవారికి శ్రీవారి కానుక

శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.11 కోట్ల విలువ చేసే 3 కేజీల బ‌రువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నక్లెస్, రెండు డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.


శోభాయ‌మానంగా సిరుల తల్లి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

శ్రీ శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 నుండి 11.45 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టి వేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెడల్స్, తులసి మాల‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. త‌మిళ‌నాడులోని తిరుపూర్‌కు చెందిన దాతలు ఈ మాల‌లను విరాళంగా అందించారు.


ఆకట్టుకున్న ఫలపుష్పం మండపం
పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఇందులో ఆస్ట్రేలియా ఆరంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25 వేల కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12.15 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.కాగా రాత్రి 7.30 గంటలకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.



 




Tags:    

Similar News