శ్రీవారి క్షేత్రంలో కదలిన గరుడవాహనం..

లక్షలాది యాత్రికులతో కిటకిటలాడుతున్న తిరుమల.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-28 14:02 GMT
తిరుమలలో ఆదివారం రాత్రి నుంచి యాత్రికులతో ఇలా కిక్కిరిసింది.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారు గరుడవాహనంపై మాడవీధుల్లో విహారానికి బయలుదేరారు. ఈ అపురూప సందర్భాన్ని కనులారా చూసి తరించాలని లక్షలాది మంది యాత్రికులు తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలతో పాటు తిరుమల క్షేత్ర మొత్తం తీర్థ జనంతో నిండిపోయింది.


తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 12 గంటల వరకు గరుడవాహనంపై విహరించే స్వామివారిని చూసి తరించాలని లక్షలాదిమంది యాత్రికులు తిరుమల లో నిరీక్షిస్తున్నారు.

తిరుమల బేడీఆంజనేయస్వామి ఆలయం ఎదుట యాత్రికుల రద్దీలో ఓ భాగం

తిరుమలలో గరుడోత్సవం సాధారణంగా ఎనిమిది గంటల తరువాత ప్రారంభమయ్యేది. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, ప్రశాంతంగా అందరికీ స్వామివారి దర్శనం కల్పించడానికి వీలుగా టిటిడి పాలకమండలి చైర్మన్ బిఆర్. నాయుడు శ్రద్ధ తీసుకున్నారు. ఆ మేరకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవను ముందుగానే ప్రారంభించడానికి కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వాహనమండపంలో గరుడవాహనంపై ఆశీనులైన మలయప్పకు హారతి సమర్ఫణలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు

పులకించిన తిరుమల గిరులు

తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వాహన మండపం నుంచి గరుడవాహనంపై మలయప్ప స్వామివారిని ఆశీనులను చేశారు. శ్రీవిల్లి పుత్తూరు నుంచి ఆండాళ్ (గోదాదేవి) ఆలయం నుంచి తీసుకువచ్చిన హారాలను స్వామివారి మెడలో అలంకరించారు. చెన్నై నుంచి హిందూ ధర్మార్థ సమితి అప్పగించిన గొడుగులను కూడా గరుడవాహన సేవ పై ఆసీనులైన స్వామివారికి నీడగా పట్టారు. వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో సర్వాలంకార భూషితుడైన శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. వాహనమండపం వద్ద తెరపైకి లేవగానే ఆలయ పరిసర ప్రాంతాలన్నీ గోవిందా నామ స్మరణలతో పులకించాయి.
మొదటి హారతి

వాహన మండపం వద్ద స్వామివారి పల్లకి సేవ వద్ద టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింహాల తోపాటు పాలకమండలి సభ్యులు, ప్రోడకాల్ విఐపి లు హారతి అందుకున్నారు. గరుడ వాహనంపై ఉన్న స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్నారు. శ్రీవారి వాహన సేవను అందరూ చూసే విధంగా ప్రతిచోట యాత్రికుల వైపు పల్లకిని తిప్పడం ద్వారా దర్శనం కల్పించడానికి టిటిడి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
గరుడ వాహనంపై ఉన్న ఆసీనులైన మలయప్ప స్వామి ఆసీనులైన పల్లకీసేవ ముందు దేశంలోని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు విభిన్న కళారూపాలతో కళాక్షన సమర్పించారు. గరుడ వాహనం నేపథ్యంలో తిరుమలగిరులన్నీ లక్షలాదిమంది భక్తులతో నిండిపోయింది. తిరుపతి నుంచి యాత్రికులను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నిరంతరాయంగా బస్సులు నడుపుతున్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత యాత్రికులు తిరుమల నుంచి తిరిగి రావడానికి కూడా ఏర్పాట్లు చేశారు. తిరుపతి తో పాటు తిరుమలలో కూడా యాత్రికులు ఇబ్బందులు లేకుండా దాదాపు 7వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు.

తిరుమలలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి మురళీకృష్ణ సారధ్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. గ్యాలరీలో ఉన్న యాత్రికులకు కూడా ఏమాత్రం గుర్తు లేకుండా అన్న ప్రసాదాలు, మంచినీరు అందించడంలో దాదాపు మూడు వేల మంది శ్రీవారి సేవకులు ఉదయం నుంచి విరామం లేకుండా తమ సేవా చాటుకుంటున్నారు.
Tags:    

Similar News