రేషన్‌ పంపిణీ వాహనాల రద్దు నిర్ణయం మంచిది కాదు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ లేఖ రాశారు.;

Update: 2025-05-21 07:27 GMT

రేషన్‌ వాహనాల పథకం విషయంలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం కారణంగా లబ్ధిదారులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఈ నిర్ణయంపై మరో సారి పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆ మేరకు ఈఏఎస్‌ శర్మ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

రేషన్‌ సరుకుల పంపిణీ పథకాన్ని రద్దు చేస్తూ, లబ్ధిదారుల ఉపాధి పరిరక్షణ దిశలోభాగంగా రేషన్‌ వాహనాలను వారికే బదలాయిస్తున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటన చూసాను. ఇది లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించేదిగా ఉంది. ఈ విషయంలో ముందున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ పథకం కారణంగా వందలాది లబ్ధిదారుల కుటుంబాలకు ఉపాధి కలిగింది. అలాంటి పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల వారికి తీవ్ర నష్టం జరుగుతుందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇది వరకే దీనిపై నేను ఒక లేఖ రాశాను. దీని వల్ల కలిగే నష్టం గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే లబ్ధిదారులకు, రేషన్‌ పంపిణీ చేసే వాహనాలను బదలాయించడం కారణంగా వారికి కొంతవరకు వెసులుబాటు జరుగుతుందని ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ వారికి బదలాయించబడే వాహనాలను, లబ్ధిదారులు టాక్సీల రూపంలో ఉపయోగించడం వల్ల సంపాదించే ఆదాయం చాలా నామ మాత్రంగా ఉంటుంది. రేషన్‌ పంపిణీ వాహనాల మీద టాక్స్, ఇన్సూరెన్స్, ఇంధన చార్జీలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా లబ్ధిదారులు వారి వాహనాలను సులభంగా అమ్ముకోలేరు. అంటే ప్రభుత్వం వారికి కేవలం వాహనాలను బదలాయించడం వలన, వారు తీవ్రంగా నష్టపోతారని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకం క్రింద ముందున్న ప్రభుత్వం లబ్ధిదారులతో చేసుకున్న ఒప్పందం 2027 వరకు అమలులో ఉందన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని శర్మ పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మీద నమ్మకం పెట్టుకుని లబ్ధిదారులు తమ వాహనాలను ఇంతవరకు నడుపుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న అలాంటి ఒప్పందాన్ని ప్రభుత్వం ఏక పాక్షికంగా రద్దు చేయడం సబబు కాదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ఒప్పందాన్ని వచ్చే రెండు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సీఎం చంద్రబాబును శర్మ కోరారు. పథకం క్రింద గుర్తింపబడిన లబ్ధిదారులకు ఇతర ప్రభుత్వ విభాగాలలో పనులు అప్పగించి, వారికి ఎదో విధంగా ప్రత్యామ్నాయ ఉపాథి కలిగించడం చాలా అవసరమని కోరారు. పథకం అమలు సమయంలో చాలా మంది లబ్ధిదారులు వివిధ కారణాల వల్ల చనిపోయారని, అలా చనిపోయిన సుమారు 80 లబ్ధిదారుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేసి వారిని ఆదుకోవాలని కోరారు. రేషన్‌ బియ్యం పంపిణీ వాహనాల పథకం మీద, వాటి మీద ఆధారపడి జీవిస్తున్న లబ్ధిదారుల మీద, మరణించిన లబ్దిదారుల కుటుంబాలను ఆదేకునే అంశాల మీద సీఎం చంద్రబాబు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News