ఆస్తుల కోసం గుండెల్లో గునపాలు దింపే కొడుకులున్న కాలంలో ఓ కొడుకు తన తండ్రిని గుండెల్లో పెట్టుకుని గువ్వల కేంద్రంగా మార్చాడు. మాటలతో సరిపెట్టకుండా.. గువ్వల్లో తన తండ్రిని చూసుకునేందుకు ఏకంగా పంట చేనునే పిట్టలకు ధారాదత్తం చేశారు. పంట కొచ్చిన చేనును పిట్టలకు విహార కేంద్రంగా మార్చాడు. రంగు రంగుల పక్షుల కిలకిలలతో సంబరపడుతున్నాడు. అతడే యువ ఇంజినీర్ పాలేటి శివాజీ. అప్పుడెప్పుడో పిట్టల దొర సలీం ఆలీని తలపిస్తున్నాడు ఈ పర్యావరణ ప్రేమికుడైన కడప జిల్లా వాసి పాలేటి శివాజీ.
"ఆ జొన్న, సజ్జ చేలో ఎగురుతున్నది పక్షులు కాదు. మా నాన్నకు ప్రతిరూపం" అని శివాజీ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్యవంతమైన జీవితానికి సేంద్రియ పంటలు మనుషులకే కాదు. పక్షులకు కూడా కీలకం అని శివాజీ వ్యాఖ్యానించారు. ఈ ఆహ్లాదకరమైన సన్నివేశాన్ని చూడాలంటే కడప జిల్లా రాజంపేట సమీపంలోని శింగనవారిపల్లెకు వెళ్లాల్సిందే.
ఎలా వెళ్లాలి..
రాజంపేట పట్టణం దాటిన తర్వాత తాళ్లపాక గ్రామానికి సమీపంలో సున్నపురాళ్లపల్లె వస్తుంది. దీనికి సమీపంలో సజ్జ పంటపై రంగురంగుల గువ్వలు లెక్కలేనన్ని ఆకాశంలో ఎగురుతుంటాయి. అదీ కనిపించకుంటే అల్లంత దూరం వరకు పక్షుల కిలకిలారావాల రోద వినిపిస్తూ ఉంటుంది. ఈ సందడి వింటూ వెళితే సింగనివారిపల్లెకు ఎవరినీ దారి అడగకుండానే చేరుకోవచ్చు.
పర్యావరణ రక్షణకు ఏమి చేస్తున్నాడు?
తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను తొలగించడంలో ఒక సంచార పాఠశాలను నడిపే విధంగా విద్యార్థులను శివాజీ మమేకం చేస్తూ ఉంటారు. ఎకో సేవియర్స్ పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమాల్లో మొక్కలు పెంచడం పక్షులకు ఆహారం అందించడం తోపాటు "ప్లాస్టిక్ రహిత తిరుపతి" కోసం పనిచేస్తున్న ఆయన అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.
ఐదు రోజులు ఉద్యోగం..
సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసే శివాజీ వారంలో ఐదు రోజులు వర్క్ ఫ్రం హోంలో ఉంటారు. శని, ఆదివారాలు పూర్తిగా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు. ఆయన వెంట యువకులు, విద్యార్థులు కూడా వెళ్లడానికి అత్యంత ఇష్టం చూపిస్తారు. పాలేటి శివాజీని ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి శనివారం మధ్యాహ్నం పలకరించారు. ఆ సమయంలో ఆయన తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరివేయించడంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో పక్షులకు ఆహారం అందించేందుకు జొన్నలు, సజ్జలు వెంట తీసుకువచ్చారు. ఒకపక్క ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరివేస్తూనే, తిరుమలలోని అటవీ సమీప ప్రాంతంలో సజ్జలు చల్లుతూనే మాట్లాడారు.
"ప్రకృతికి ఆలవాలమైన అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రీఫారెస్ట్రేషన్ జరగాలి. మొక్కల పెంపకంతో మాత్రమే ఇది సాధ్యం కాదు. పక్షులు, జంతువులను కాపాడుకోవడం ప్రధానం. దీని కోసమే చిరుధాన్యాలు చల్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నా" అని పాలేటి శివాజీ స్పష్టం చేశారు.
మా నాన్న కోసం..
పాలేటి శివాజీది రాజంపేటకు సమీపంలోని సింగనవారిపల్లె. ఊరిలో అతనికి ఓ అన్న, అక్క బావ ఉన్నారు. శివాజీ తండ్రి వెంకటసుబ్బయ్య సంవత్సర కిందట చనిపోయారు. సింగనవారిపల్లె వద్ద వారికి రెండెకరాల పొలంలో అరటి తోట ఉండేది. పంట కాలం పూర్తి కావడంతో చదును చేశారు. 75 రోజుల కిందట ఆ రెండెకరాల్లో సజ్జలు, జొన్నలు సాగు చేసి, పక్షుల కోసం ఆహారంగా వదిలివేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గమనిస్తే ఒకటి కాదు, రెండు కాదు వందల సంఖ్యలో అనేక రకాల పక్షులు, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల అదృశ్యమైన గువ్వలు కూడా గుంపులు గుంపులుగా కిలకిల రావాలతో సందడి చేస్తున్నాయి. పంటను ఇలా పక్షులకు వదిలివేయడంపై పాలేటి శివాజీ ఏమంటారంటే...
"మా నాన్న వెంకటసుబ్బయ్యకు సంవత్సరీకం పూర్తయింది. మా బావ రెడ్డెయ్య పొలంలో సజ్జ పంట సాగు చేసి గల్ఫ్ కు వెళ్లారు. మా ఇంట్లో ముందుగానే మాట్లాడుకున్నాం. పశు,పక్షాదులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు పంటను పెంచుదాం" అని చెప్పాను. దీనికి మా ఇంట్లో అందరూ సమ్మతించారు" అని శివాజీ వివరించారు.
"సజ్జ పంటపై గింజలు తినడానికి వస్తున్నవి పక్షులు కాదు. వాటిలో మా నాన్న ఆత్మను చూసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో మా వంతు బాధ్యత నిర్వహిస్తున్నామనే సంతృప్తి మిగిలింది" అని పాలేటి శివాజీ తన మనసులోని మాటను ఆవిష్కరించారు.
సేంద్రియ పద్ధతిలో సాగు..
సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన మిల్లెట్స్ తినడం వల్ల మనుషుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందనే విషయం గుర్తించారు. పెద్దపెద్ద హోటళ్లలో కూడా మిల్లెట్స్ ఆహారం తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పక్షులు కూడా ఇలాంటి ఆహారమే తీసుకోవాలని పాలేటి శివాజీ భావించారు. రసాయనాలు ప్రధానంగా ఎరువులు లేకుండా సజ్జ పంట సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పే మాటలను అర్థం చేసుకున్న ఆయన ఎరువుల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.
"పంట కాలం పూర్తయిన తర్వాత అలాగే దున్నేయడం వల్ల కార్బన్ గా మారి నైట్రోజన్ ఇస్తుంది. ఇది కంపోజ్ కావడం వల్ల ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ తరహా పంటల వల్ల ఆరోగ్యం పై దుష్ప్రభావాలు చూపించవు" అని పాలేటి శివాజీ విశ్లేషించారు. తాను ఎంచుకున్న మార్గంలో పక్షులు కూడా అలాంటి ఆహారమే అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన వివరించారు.
అది ఓ పర్యావరణ పార్క్
రాజంపేట పట్టణానికి సమీపంలోని సింగనవారిపల్లె అనేక రకాల పక్షులకు ఆలవాలంగా మారింది. సజ్జ పంటను చూసి అక్కడి మేతకు వస్తున్న చిలుకల కిలకిల రావాలతో ఆ గ్రామం మొత్తం సందడి ఏర్పడింది. రకరకాల గువ్వలు కూడా ఎక్కడి నుంచో విహారయాత్రకు వచ్చినట్లు అక్కడి ప్రదేశం మారిపోయింది.
"జొన్న పంటలో గింజలు తినడానికి బ్లూ, ఎల్లో, బ్లాక్, వైట్ కలర్లలో ఉన్న ఎన్నో గువ్వలు ఇక్కడ సందడి చేస్తున్నాయి. గ్రామస్తులు కూడా వాటిని ఆస్వాదిస్తున్నారు" అని పాలిటి శివాజీ వివరించారు. పక్షులపై పరిశోధన చేసేవారు ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఈ గువ్వలు ఏ జాతికి చెందినవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాలను కూడా పరిశీలించడానికి వీలైన వాతావరణం సింగనవారిపల్లె వద్ద కనిపిస్తుందని శివాజీ చెబుతున్నారు.
పిట్టలు అంటే పిల్లలకు ప్రాణం.. పసిపిల్లల మనస్తత్వం చిన్న జంతువులు, పక్షులకు ఏ మాత్రం తీసిపోదు. పక్షులంటే అమితమైన ఆసక్తి చూపిస్తారు. ఇందులో సందేహం లేదు. పాలేటి శివాజీ ఐటీ (information technology) నిపుణుడిగా ఏడేండ్ల పాటు యూఎస్ లో పనిచేశారు. అక్కడ కూడా పర్యావరణ పరిరక్షణ లో కీలకమైన ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలను చైతన్యం చేశారు. పశువులు పక్షుల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2000 లో తిరిగి వచ్చిన ఆయన బెంగుళూరు కేంద్రంగా ఓ విదేశీ కంపెనీలో పనిచేసేవారు.
"లండన్ లో నా స్నేహితుడు నాలుగేళ్ల కూతురు లడ్డు. ఆ పాప నేను చేసే పనులతో పక్షులు అంటే అమిత ప్రేమ చూపించేది. నేను తిరిగి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో పక్షులను పెంచుతున్న విధానాన్ని వివరిస్తూ వీడియో పంపించడం ఆనందం కలిగించింది. ప్రస్తుతం ఆ పాపకు ఆరు సంవత్సరాలు" అని పాలేటి శివాజీ గుర్తుచేసుకొని సంబరపడ్డారు.
ప్లాస్టిక్ రహిత తిరుపతి కోసం..
తిరుపతిలో వారాంతంలో రెండు రోజులు అందుబాటులో ఉంటూ నగరంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరు వేయించడంతోపాటు కపిలతీర్థం సమీపంలోని దివ్యారామంలో కూడా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను మరింత చైతన్యం చేశారు. తద్వారా అనేకమందిని ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేశారు. అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వేయడం, విద్యార్థులు యువతతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్, అడ్వెంచర్ క్లబ్ నిర్వాహకుడు నిర్వాహకుడు బివి రమణ మాట్లాడుతూ,
"పాలేటి శివాజీ పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషి అభినందనీయం. నాకు మంచి స్నేహితుడు. యువకుడైన శివాజీ సమాజాన్ని చైతన్యం చేయడంలో చురుగ్గా ఉన్నారు. విద్యార్థులను పర్యావరణ ప్రేమికులుగా మార్చడానికి అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. పక్షులను కాపాడుకోవడంలో కూడా మంచి పద్ధతులు అనుసరిస్తున్నారు" అని సీనియర్ జర్నలిస్ట్ బీవీ రమణ అభినందించారు.
అడవుల్లో మొక్కల పెంపకం..
పర్యావరణ ప్రేమికుడు, యువ ఐటీ నిపుణుడు పాలిటి శివాజీ మాటల్లో చెప్పాలంటే రీఫారెస్ట్రేషన్ అనేది పక్షులు, జంతువులను కాపాడుకోవడంతో మాత్రమే సాధ్యం అవుతుందని అంటారు. దీనికోసం
"మొక్కల పెంపకానికి సీడ్ బాల్స్ వేయడం, పక్షులను స్వాగతించడానికి ఒకసారి అక్కడక్కడ సజ్జలు, రాగులు, జొన్న విత్తనాలతో పాటు ఇంకొన్ని రకాలు అడవిలో చల్లితే, మళ్లీ మన అవసరం ఉండదు. కంకులు పెరిగిన తర్వాత ఆహారం కోసం పక్షులు తామరతంపరగా వస్తాయి. ఆ విత్తనాలు కింద పడి వనాలుగా మారతాయి. ఈ పని ఒకసారి చేస్తే చాలు" అని పాలేటి శివాజీ పర్యావరణాన్ని ప్రేమించే వారికి సూచనల చేశారు. విద్యార్థులకు ఇది అలవాటు చేయాలని కూడా ఆయన కోరారు.
ఆయన ఇంకా ఏమంటారు అంటే రీఫారెస్ట్రేషన్ కోసం మూడు సంవత్సరాల నుంచి సీడ్ బాల్స్ వేసిన వైనాన్ని ఆయన వివరించారు. దీనికోసం తనకు వచ్చే వేతనంలో ఎక్కువ మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసమే వెచ్చిస్తున్నట్టు వివరించారు. మినహా, ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం చెప్పడానికి నిరాకరించారు. సమాజానికి మనం చేసే సేవలో ఖర్చు గురించి ప్రస్తావన రాకూడదు అని సున్నితంగా తిరస్కరించారు.
ఇప్పటివరకు టీటీడీ అటవీ శాఖ అధికారులకు 50 వేల సీట్ బాల్స్ అందించాలని చెప్పారు. మరో 50 వేలు ఓ స్వచ్ఛంద సంస్థకు అందించాను. పదివేల సీడ్ బాల్స్ కడప జిల్లా ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో చల్లినట్లు పాలేటి శివాజీ వివరించారు.
సచ్చిదానంద స్వామీజీ ఆదర్శం
పక్షులను పెంచడంలో తనకు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదర్శమని పాలేటి శివాజీ చెప్పారు. బెంగళూరులోని సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నాలుగువేల రకాల పక్షులు పెంచుతుంటారు. వాటికి గింజలు ఆహారంగా అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తీరు తనను ఆకర్షించిందని శివాజీ గుర్తు చేశారు. వీటివల్ల క్రిమి కీటకాలు కూడా ఆస్కారం లేని విధంగా పర్యావరణానికి పక్షులు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు.
ప్రకృతి ప్రేమికుడు, పంటలకు రసాయనిక ఎరువులు క్రిమినసంహారక మందులు లేకుండా ఆరోగ్యకరమైన అధిక ఉత్పత్తి సాధించడంలో సఫలమైన సుభాష్ పాలేకర్ తనకు స్ఫూర్తి అని పాలేటి శివాజీ చెప్పారు. అందువల్లే మా ఊరు సింగనవారిపల్లె వద్ద పంటల సాగుకు రసాయనిక ఎరువులు కూడా వాడడం లేదని ఆయన స్పష్టం చేశారు. పక్షులకు ఆహారంగా వదిలివేసిన సజ్జ పంటకు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నామని, గ్రామస్తులను కూడా ఆ దిశగా చైతన్యం చేసినట్లు శివాజీ చెప్పారు.
"పంటకు రక్షణ కవచంగా చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని పాలేకర్ చెప్పిన మాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పంటల సాగులో రసాయనిక ఎరువులు వాడకపోవడం వల్ల పక్షులు ఎక్కువగా వస్తాయి. వీటివల్ల పురుగులు నాశనమవుతాయి. తద్వారా సాగులోని పంటకు మేలు జరుగుతుంది" అని పాలేకర్ చెప్పిన సూత్రాన్ని ఆచరిస్తున్నట్లు శివాజీ స్పష్టం చేశారు.
మా ఊరి వద్ద సాగు చేసే జొన్న పంటకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్లు ఆయన చెప్పారు. రసాయనిక ఎరువులు వాడిన చిరుధాన్యాలు తినడానికి పక్షులు కూడా ఇష్టపడవు అని శివాజీ చెప్పారు. వీటన్నిటిని సూక్ష్మంగా అర్థం చేసుకున్న తర్వాత
"పర్యావరణ రక్షణ కోసం పనిచేసే నేను, నా కుటుంబ సభ్యులకు కూడా సేంద్రీయ పద్ధతిలో పంటల సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నాం" అని పాలేటి శివాజీ తన మార్గాన్ని వివరించారు.