సూపర్ సిక్స్‌ను కొందరు ఎగతాళి చేశారు

పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయటం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-12-01 09:43 GMT

సూపర్ సిక్స్‌ను కొందరు ఎగతాళి చేశారు కానీ ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరుతూ, అంతా కలిసి అనూహ్యమైన మద్దతు ఇచ్చారని చెప్పారు. 164 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి మా బాధ్యతను పెంచారని అన్నారు. ప్రజా వేదికలో పేదల సమస్యలు విన్నారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమం, మహిళా శక్తి వంటి అంశాలపై వివరించారు.

 పెన్షన్లపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.  18 నెలల్లో ఒక్క పెన్షన్ల కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు పెట్టామని, దేశంలో ఎవరూ ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయటం లేదని వివరించారు. ఏడాదికి రూ.33 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని, ప్రతీ నెలా 63 లక్షల పైచిలుకు మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పెన్షన్లలో 59 శాతం మహిళలకే ఇస్తున్నామని, అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్, దానిని పెంచింది కూడా మా ప్రభుత్వమే అని పేర్కొన్నారు. గత పాలకులు ముక్కుతూ మూలుగుతూ రూ.250 చొప్పున మాత్రమే పెంచారు, ఒకేసారి రూ.4 వేల పెన్షన్ ప్రకటించి అమలు చేసింది కూటమి ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

మహిళా సంక్షేమంపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. తల్లికి వందనం కింద ప్రతీ విద్యార్థికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం తల్లుల ఖాతాలో వేశామని, జనాభా సమతౌల్యం కోసం మనం ఆలోచన చేయాలి.  అప్పుడే దేశం, రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తాయని చెప్పారు. ఆడబిడ్డలు కష్టపడకుండా ఉండాలనే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇస్తోందని, స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లేలా సదుపాయం కల్పించామని తెలిపారు. ఇప్పటి వరకూ 25 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు, రూ.855 కోట్ల మేర ఆర్టీసీకి చెల్లించామని వివరించారు. రైతులు ధాన్యం విక్రయించిన 5-6 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామని, 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించామని, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతీ రైతుకూ రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రూ.14 వేల రూపాయల్ని పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు.

రైతు సంక్షేమంపై చంద్రబాబు మాట్లాడుతూ.. పంచ సూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ కూడా చేపట్టిందని చెప్పారు. ప్రతీ రైతునూ కలిసి అవగాహన కల్పిస్తున్నామని, త్వరలోనే చింతలపూడి లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు విని, పరిష్కారాలు చేయాలని స్థానిక నాయకులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్, SP, స్థానిక MLA, TDP నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News