అధికారులపైనే వేటు.. అమాత్యుల ఊసే లేదు..

సింహాచలం దుర్ఘటనలో ఈవో సహా ఏడుగురిపై చర్యలు. దేవదాయ శాఖ కమిషనర్‌పై చర్యలకు సర్కారు మీనమేషాలు.;

Update: 2025-05-06 08:54 GMT

అంతా అనుకున్నట్టే అయింది. సింహాచలం చందనోత్సవం వేళ గోడ కూలిన దుర్ఘటనపై విచారణ జరిపిన కమిటీ కేవలం అధికారులనే బాధ్యులను చేసింది. చందనోత్సవం పర్యవేక్షణలో మంత్రుల కమిటీ వైఫల్యాల ఊసెత్తడం మానేసింది. త్రిసభ్య కమిటీ సింహాచలం దేవస్థానం ఈవో సహా ఏడుగురినే బాధ్యులను చేయడంతో ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. కీలకమైన దేవదాయ శాఖ కమిషనర్‌పై కూడా చర్యలకు సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏప్రిల్‌ 30 వేకువజామున చందనోత్సవం నాడు గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆగమేఘాల మీద పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ చైర్మన్‌గా, ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరావు సభ్యులుగా ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని వేసింది. ఘటన జరిగిన మర్నాడే రంగంలోకి దిగిన ఈ కమిటీ మూడు రోజుల పాటు విచారణ జరిపింది. దేవస్థానం ఈవో, ఈఈ, డీఈఈలు, పర్యాటక శాఖ ఈఈ, డీఈఈలు, గోడ నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టరుతో పాటు మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించింది. ఏడుగురిని బలిగొన్న గోడ నిర్మాణానికి అధికారిక అనుమతులు లేవని, ప్లాన్‌తో పాటు డ్రాయింగ్‌ కూడా లేదని నిర్థారారించింది. ‘ప్రసాద్‌’ పథకంలో చేపట్టే పనుల్లో ఈ గోడను అనధికారికంగా చేర్చి కాంట్రాక్టరుతో బలవంతంగా నిర్మించారని తేల్చింది. అంతేకాదు.. ఈ గోడకు పునాదులే లేవని, నాణ్యత మచ్చుకైనా లేదని, దీంతో కొద్దిపాటి వర్షానికే కూలిపోయిందని గుర్తించింది. కమిటీ విచారణలో దేవస్థానం ఈవో, దేవదాయ, పర్యాటక శాఖల ఇంజినీర్ల అలక్ష్యాన్ని ఎత్తి చూపింది. మరోవైపు చందనోత్సవం నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు మంత్రులతో కూడిన సమన్వయ కమిటీని కూడా చాలారోజుల ముందుగానే నియమించింది. ఈ కమిటీలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనితలు ఉన్నారు. ఈ మంత్రుల కమిటీ అధికారులతో సమావేశమై తూతూమంత్రంగా సమీక్షించారే తప్ప క్షేత్రస్తాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించలేదు. అనధికార గోడ నిర్మాణం వైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ ఈ మంత్రులు గోడ నిర్మాణాన్ని పరిశీలించి ఉంటే దాని నాణ్యత లోపం స్పష్టంగా కనిపించి ఉండేది. కానీ వీరు ఆ పని చేయకపోవడంతో కాంట్రాక్టరు, ఇంజినీర్లు ఏకమై నాలుగైదు రోజుల్లోనే గోడ నిర్మాణం పూర్తయిందనిపించారు. అనంతరం ఈ గోడను ఆనుకునే రూ.300 క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. ఏమాత్రం పటుత్వం లేని ఆ గోడ కూలడంతో ఏడుగురు భక్తులు అక్కకడికక్కడే మృత్యువాతపడ్డారు.

అమాత్యుల అలక్ష్యంపై దృష్టి పెట్టని కమిటీ..
ఇక చందనోత్సవం దుర్ఘటనలో అధికారులు, ఇంజినీర్ల నిర్లక్ష్యంపైనే దృష్టి సారించిన విచారణ కమిటీ తమకున్న పరిమితులతో మంత్రుల కమిటీ జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయింది. తన మూడు రోజుల విచారణలో అధికారులు, కాంట్రాక్టర్లనే విచారించింది. కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన 72 గంటల గడువులోగా విచారణ పూర్తి చేసి సోమవారం ముఖ్యమ్రంతి చం్రద్రబాబునాయుడికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. అందులో మంత్రుల వైఫల్యానికి సంబంధించి ప్రస్తావన చేయలేక పోయింది.
దేవాదాయ శాఖ కమిషనర్‌పై మీనమేషాలేల?
ఇక సింహాచలం చందనోత్సవం నాడు గోడ కూలిన ఘటనలో దేవస్థానం ఈవో సహా ఏడుగురు దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు, ఇంఇజీనర్లతో పాటు దేవదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను కూడా త్రిసభ్య కమిటీ బాధ్యులుగా తేల్చింది. సంబంధిత అధికారులతో ఆయన సమన్వయం చేయలేదని, ఉత్సవ నిర్వహణలో లోపాలను గుర్తించలేకపోయారని, గోడ నిర్మాణం గురించి తెలసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుట్టింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఏడుగురుని సస్పెండ్‌ చేసింది. కాంట్రాక్టరుపై క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తోంది. అయితే దేవదాయ శాఖ కమిషనర్‌పై చర్యలకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రామచంద్రమోహన్‌ కూటమి ప్రభుత్వానికి అనుకూలురన్న ప్రచారం ఉంది. అందువల్లే విచారణ కమిటీ సిఫార్సు చేసినా ఆయన జోలికి వెళ్లలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రామచంద్రమోహన్‌ను స్పస్పెండ్‌ చేయాలిః అమర్నాథ్‌
‘సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తుల చావుకు కారణమైన అధికారుల్లో దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ రామచంద్రమోహన్‌ కూడా ఒకరు. ఈ దుర్ఘటనలో ఈవో సహా ఏడుగురిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తక్షణమే రామచంద్రమోహన్‌ను సస్పెండ్‌ చేయాలి. కూటమి ప్రభుత్వంలో ఒక ఐఏఎస్‌ కాని అధికారిని దేవదాయ శాఖ కమిషనర్‌గా నియమించడం చరిత్రలోనే లేదు. గతంలో చంద్రబాబు మూడుసార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్‌ అధికారులనే దేవదాయ శాఖ కమిషనర్లుగా ఉన్నారు. అలాంటిది రామచంద్ర మోహన్‌ను కమిషనర్‌గా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. గతంలో సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. చందనోత్సవం వేళ ఇక్కడే ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.
ఏడుగురు మృతులు.. ఏడుగురు సస్పెన్షన్‌
చందనోత్సవం దుర్ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సులతో ప్రభుత్వం మొత్తం ఏడుగురిని సస్పెండ్‌ చేసింది. వీరిలో సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, డీజీ శ్రీపివాసరావు (దేవస్థానం ఈఈ), కె.రమణ (ఏపీటీడీసీ ఈఈ), కేఎస్‌ఎన్‌ మూర్తి (దేవస్థానం డీఈఈ), ఏఆర్‌వీఎల్‌ఆర్‌ స్వామి (డీఈఈ–ఏపీటీడీసీ), పి.మదన్‌మోహన్‌ (ఏఈ–ఏపీటీడీసీ), కె.బాబ్జీ (జేఈ, సింహాచలం దేవస్థానం). వీరితో పాటు గోడ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరు కె.లక్ష్మీనారాయణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నారు. ఆయన కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.
Tags:    

Similar News