ఆ బాధ్యత ఉద్యోగులపై ఉంది

నవంబరు 1 నుంచి రాష్ట్రవాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభం కానున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Update: 2025-10-23 08:54 GMT

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పాలన సంస్కరణలు తీసుకొచ్చామని, వాటి ఫలితాలను ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డీడీఓ) కార్యాలయాలు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయాలను స్పష్టం చేశారు.

క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించామని పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

కూటమి ప్రభుత్వం నిధుల సమకూర్పులో, పాలన సంస్కరణల్లో సానుకూల దృక్పథంతో ఉందని, ఈ ఫలితాలను ప్రజలకు చేర్చి, గ్రామీణాభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నిధుల వినియోగం, సంస్కరణల అమలుపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక సమర్పించాలని సూచించారు.

Tags:    

Similar News