ఆడబిడ్డల ఎదురుగా మగవాళ్లను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు
ఆపరేషన్ సింధూర్‌కు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని సీఎం చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-05-09 12:32 GMT
పహల్గాం ఉగ్ర మూకలు బీభత్సం సృషించారని, ఆడబిడ్డల ఎదురుగా మగవాళ్లను అత్యంత కిరాతంగా ఉగ్ర వాదులు పొట్టన పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఛాయాపురం ప్రజావేదికలో శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉగ్రవాదుల మీద, ఉగ్రవాదుల దుశ్చర్యల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు. అమాయకులైన భారతీయులను అతికిరాతంగా ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదానికి అంతం పలకాలన్నారు. అందులో భాగంగా టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు.
పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత దేశం మీద దాడులకు తెగబడుతోందని, భారత సైనిక దళాలు వారికి ధీటుగా బదులు చెబుతున్నాయని అన్నారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అనంతపురం జిల్లాకు చెందిన తెలుగు బిడ్డ వీరజవాన్ మురళీ నాయక్ దేశ భక్తితో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో తాను ఫోన్‌లో మాట్లాడానని, మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ వీరమరణానికి రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను తుద ముట్టించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపాలని చంద్రబాబు కోరారు. దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తూ, నిద్రాహారాలు మాని దేశం కోసం నిలబడుతున్న సైనికుల వల్లే దేశ ప్రజలు హాయిగా జీవించగలుగుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.