రేవంత్ ను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవటంలేదు ?

ముఖ్యమంత్రితో సినీరంగం మంచి సంబంధాలనే మైన్ టైన్ చేస్తుంటుంది. అయితే రేవంత్ విషయంలో సినిమారంగం ఎందుకు దూరంగా ఉంటుందో అర్ధంకావటంలేదు.

Update: 2024-07-30 08:50 GMT

వినటానికే విచిత్రంగా ఉన్నా ఇదే వాస్తవం. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు. ప్రముఖ కవి, సినీ గేయరచయిత, రాజ్యసభ మాజీ ఎంపీ సీ నారాయణరెడ్డి(సీనారే) పేరుతో ఏర్పాటుచేసిన విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత శివశంకరికి రేవంత్ ప్రధానంచేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతు సినిమా కళాకారులకు అందించే నంది అవార్డులు కార్యక్రమం నిర్వహించి పదేళ్ళవుతోందని గుర్తుచేశారు. వెంటనే నంద అవార్డులను పునరుద్ధరించాలని, ప్రతి ఏడాది నంది అవార్డుల పేరుతో కార్యక్రమాలను నిర్వహించాలని విజ్ఞప్తిచేశారు.

ఈ విషయమై రేవంత్ మాట్లాడుతు నంది అవార్డుల స్ధానంలో గద్దర్ పేరుతో అవార్డులను ఇవ్వబోతున్నట్లు ఏడాది క్రితమే చేసిన ప్రకటనను గుర్తుచేశారు. సినిమా రంగానికి సంవత్సరాల తరబడి అందచేసిన నంది అవార్డుల స్ధానంలో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులను ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినా సినీ ప్రముఖులు ఎవరూ స్పందించలేదని నిష్టూరంగా చెప్పారు. తన ప్రకటనపై స్పందించని సినీ ప్రముఖులు ఇపుడు మళ్ళీ నంది అవార్డుల ప్రధానాన్ని నిలిపేశారని, మళ్ళీ నంది అవార్డులను పునురద్ధరించాలని చెప్పటాన్ని ఆక్షేపించారు.

ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదని గద్దర్ అవార్డుల ప్రధానంపై సినీప్రముఖులు ప్రతిపాదనలను తన దగ్గరకు తీసుకురావాలని కోరారు. రేవంత్ వ్యాఖ్యలను చూసిన తర్వాత అందరికీ అర్ధమైంది ఏమిటంటే తెలుగుసినీరంగం రేవంత్ ను పట్టించుకోలేదని. మామూలుగా అయితే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సంబంధంలేకుండా సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసి అభినందించటం, పరిశ్రమాభివృద్ధికి సహకారం కావాలని కోరటం చాలా సహజం. ఇది కాకుండా సినిమాలు రిలీజవ్వటానికి ముందు అవసరమైనా లేదా ఏ సందర్భం వచ్చినా సీఎంను సినీ ప్రముఖులు కలుస్తునే ఉంటారు. మొత్తంమీద ప్రభుత్వంతో అంటే ముఖ్యమంత్రితో సినీరంగం మంచి సంబంధాలనే మైన్ టైన్ చేస్తుంటుంది. అయితే రేవంత్ విషయంలో సినిమారంగం ఎందుకు దూరంగా ఉంటుందో అర్ధంకావటంలేదు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో వ్యవహారం తిరగబడినట్లుంది. సినీ ప్రముఖులు లేదా సినీరంగం రేవంత్ ను పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. అందుకనే నంది అవార్డుల స్ధానంలో గద్దర్ పేరుతో అవార్డులను ఇవ్వబోతున్నట్లు రేవంత్ ప్రకటించి ఏడాదైనా ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. అప్పట్లోనే రేవంత్ ప్రకటనపై వ్యతిరేకత కూడా వినిపించింది. బహుశా సినీరంగానికి ప్రకటించే నంది అవార్డులను గద్దర్ పేరును తీసుకోవటానికి సినీప్రముఖులు ఇష్టపడేలేదేమో. ఇక్కడ రేవంత్ తప్పుకూడా ఉంది. అదేమిటంటే నంది అవార్డుల పేరును మార్చాలని అనుకున్నపుడు ఆ విషయాన్ని ముందుగా సినీరంగంలోని ప్రముఖులతో చర్చించాల్సింది. ప్రముఖల స్పందనను గమనించి రేవంత్ ప్రకటన చేసుంటే బాగుండేది. అలాకాదని ఏదో సభలో మాట్లాడుతు నంది అవార్డులను ఇకనుండి గద్దర్ పేరుతో అందచేస్తామని ప్రకటించటం సినీప్రముఖులు జీర్ణించుకున్నట్లు లేదు. అందుకనే రేవంత్ ప్రకటనను బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించలేదు.

రేవంత్ తాజా ప్రకటనతో ఈ విషయాలన్నీ ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. గద్దర్ పేరుతో రేవంత్ అవార్డుల ప్రకటన చేసిన తర్వాత కూడా తాజాగా మురళీమోహన్ మళ్ళీ నంది అవార్డుల పురస్కారాన్ని పునరుద్ధరించాని అడిగారంటే అర్ధమేంటి ? నందిపేరుతో ఇస్తున్న పురస్కారాలను గద్దర్ పేరుకు మార్చటం ఇష్టంలేదనే కదా. అందుకనే మురళీమోహన్ నంది అవార్డుల ప్రస్తావన తేగానే రేవంత్ వెంటనే గద్దర్ అవార్డులని గుర్తుచేసింది. పైగా తన ప్రకటనపై సినీ ప్రముఖులు ఎవరూ ప్రతిపాదనలతో తనదగ్గరకు రాలేదని నిష్టూరంగా చెప్పారు. దాంతోనే సినీరంగం రేవంత్ ను పెద్దగా పట్టించుకోవటంలేదన్న విషయం బయటపడింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు చాలామంది సినీప్రముఖులు ఏదో సందర్భంలో కేసీఆర్ ను కలుస్తునే ఉండేవారు. మొదటినుండి సినీరంగంలోని ప్రముఖుల్లో అత్యధికులు చంద్రబాబునాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లోనే కాకుండా ఇతరత్రా కూడా టీడీపీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేవారు. సందర్భం ఉన్నా లేకపోయినా చంద్రబాబుతో సెక్రటేరియట్ లేదా ఇంటి దగ్గరో సమావేశమవుతునే ఉండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సినీప్రముఖులు అసలు జగన్మోహన్ రెడ్డిని కలవనే లేదు. కలవకపోగా ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏముందని రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్ళు బహిరంగంగానే ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది. చిరంజీవి లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రం వ్యక్తిగతంగా జగన్ను కలిశారంతే. ఇపుడు తాజా ప్రకటనతో ఫిల్మ్ ఇండస్ట్రీ రేవంత్ ను పట్టించుకోవటంలేదన్న విషయం బయటపడింది. మరి రేవంత్ ప్రకటన తర్వాతయినా సినీరంగంలో మార్పుకనబడతుందా ? కదలిక వస్తుందా ? అన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News