టీటీడీ బోర్డులో తెలంగాణాకు పెద్దపీట

తెలంగాణాకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే రాష్ట్రానికి అనికాదు అర్ధం. తెలంగాణా(Telangana)లోని తెలుగుదేశంపార్టీ(TDP)కి, బాగా దగ్గర వాళ్ళకని మాత్రమే అర్ధం.

Update: 2024-10-31 02:56 GMT

తెలంగాణాకు చంద్రబాబునాయుడు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణాకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే రాష్ట్రానికి అనికాదు అర్ధం. తెలంగాణా(Telangana)లోని తెలుగుదేశంపార్టీ(TDP)కి, బాగా దగ్గర వాళ్ళకని మాత్రమే అర్ధం. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు బుధవారం తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ట్రస్ట్ బోర్డు9TTD Trust Board)ను నియమించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవికి, బోర్డులో సభ్యత్వం కోసం దేశం మొత్తం మీద ఎంతటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సభ్యులుగా నియమించాలని ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల స్ధాయిలో ఒత్తిళ్ళుంటాయని అందరికీ తెలిసిందే. అలాంటి బోర్డుకు ఛైర్మన్ గా ఒక టీవీ ఛానల్ ఎండీ బీఆర్ నాయుడును నియమించారు.

తాజాగా చంద్రబాబు నియమించిన 23 మంది సభ్యుల్లో నలుగురు తెలంగాణా వాళ్ళే ఉన్నారు. ఇంతమందిని ఒకేసారి బోర్డులో సభ్యులుగా నియమించింది గతంలో లేదనే చెప్పాలి. ఈ నలుగురిలో ఇద్దరు జనసేన(Janasena) అధినేత, డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(PawanKalyan) కోటాలో సభ్యత్వం పొందితే మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళు పార్టీ నేత, మరొకళ్ళు చంద్రబాబుకు మద్దతుగా నిలిచే ఒక మీడియా సంస్ధ ఛైర్మన్ కోటాలో నియమితులయ్యారు. ఎవరేకోటాలో నియమితులైనా అందరు పనిచేయాల్సింది చంద్రబాబు కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

బోర్డులో తెలంగాణా నుండి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(Bharath Bio Tech International) కో ఛైర్మన్ సుచిత్రా ఎల్లా(Suchitra Ella) నియమితులయ్యారు. సుచిత్ర ఈనాడు యాజమని చెరుకూరి కిరణ్ ప్రభాకర్ కు వియ్యపురాలవుతారు. కిరణ్ కు వియ్యపురాలు అవటమే కాకుండా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. కాబట్టి ఈమె ఇటు ఈనాడు యాజమాన్యం, అటు చంద్రబాబు వ్యక్తిగత కోటాలో సభ్యత్వం పొందారు. రెండో సభ్యత్వం ఆనందసాయిది. ఈయన తెలుగు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా బాగా పాపులర్. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు. పవన్ నటించిన చాలా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలో చిన్న జియ్యర్ స్వామి(Chinna Jeeyar Swamy) ఆశ్రమ రూపకల్పనలో కూడా ఆర్కిటెక్టుగా యాక్టివ్ గా పనిచేశారు.

మూడో సభ్యుడు బొంగునూరి మహేందర్ రెడ్డి కూడా పవన్ కు అత్యంత సన్నిహితుడే. పవన్ కు అత్యంత సన్నిహితుడు కావటమే కాకుండా మొదటినుండి ప్రజారాజ్యంపార్టీలోను ఇపుడు జనసనలో యాక్టివ్ గా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇక ఫైనల్ గా నన్నూరి నర్సిరెడ్డి చాలా సంవత్సరాలుగా పార్టీలో కీలకనేతగా ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన నన్నూరి మంచి వక్త. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఈ నేత రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడుది కూడా చిత్తూరు జిల్లానే అయినా సంవత్సరాల క్రితమే హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. కాబట్టి ఛైర్మన్ కూడా తెలంగాణా కోటా అనే అనుకోవాలి.

తెలంగాణాలో టీడీపీని బలోపేతం చేయటానికి చంద్రబాబు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఇపుడు టీటీడీ బోర్డు నియామకంలో ఏకంగా నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఇవ్వటం అంటే తనకు ఏపీ, తెలంగాణా రెండూ సమానమే అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. పైగా తెలంగాణాలోని సీమాంధ్రులను ఆకట్టుకునే అంతర్గత వ్యూహం కనబడుతోంది. ఏదేమైనా ఒకేసారి ఇంతమంది తెలంగాణా వాళ్ళకి టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇవ్వటం సంతోషించాల్సిన విషయమనే చెప్పాలి.

Tags:    

Similar News