టీడీపీ కీలక నిర్ణయం–ఒక పదవిలో 3 పర్యాయాలే

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహించారు.;

Update: 2025-05-14 15:24 GMT

తెలుగుదేశం పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు ఉండరాదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. టీడీపీలో ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ సార్లు ఉండరాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీసుకొచ్చిన ప్రతిపాదనకు టీడీపీ పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలిపింది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. దీనికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులంతా హాజరయ్యారు.

అనంతరం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను సీనియర్‌ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మూడు పర్యాయాలు లేదా ఆరేళ్లుగా ఉన్న టీడీపీ మండల పార్టీ అధ్యక్షలను, మార్చాలని, వారికి ఆ పై స్థాయి పదవలు లేదా వాటికి సమానమైన పదవులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి నెల వెల్ఫేర్‌ పథకాలు అందే విధంగా టీడీపీ ప్రత్యేక క్యాలండర్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంఘీభావం తెలుపుతూ ఈ నెల 16,17,18 తేదీల్లో తిరంగ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలతో కలిసి టీడీపీ శ్రేణులు ఈ తిరంగ ర్యాలీలను నిర్వహిస్తాయన్నారు. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ను విజయవంతంగా చేపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, సైనిక దళాలలకు అభినందిస్తూ పొలిట్‌ బ్యూరో తీర్మానం చేసిందన్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అందుకున్న నేపత్యంలో ఆయన అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
దీపం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్‌ బుకింగ్‌ల కంటే ముందుగానే నగదు చెల్లింపులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏడాదిలో ఇచ్చే మూడు సిలిండర్లకు సంబందించిన నగదును ఒకే సారి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిలండర్లను ఎప్పుడు బుక్‌ చేసుకున్నా.. సిలిండర్లను తీసుకోకపోయినా కూడా మూడు సిలిండర్లకు సంబంధించిన నగదును ఒకే సారి లబ్ధిదారుల కాఖాతాల జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జూన్‌ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఏపీలో లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతవులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్‌ 12న ప్రారంభించాలని పొలిట్‌ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Tags:    

Similar News