కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీల రియాక్షన్ ఇదే..!
కేంద్ర ప్రభుత్వం నేడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించింది. ఇందులో ఏపీకి ప్రత్యేక నిధులను వెల్లడించింది. దీనిపై టీడీపీ ఎంపీల రియాక్షన్ ఇదే..
కేంద్ర ప్రభుత్వం నేడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించింది. ఇందులో ఏపీకి ప్రత్యేక నిధులను వెల్లడించింది. ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తున్న క్రమంలో తాజాగా టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్రం బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమస్యలకు పరిష్కారం చూపిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం తన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహాయం చేయనున్నట్లు వెల్లడించడమే కాకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆంధ్రుల కలల ప్రాజెక్ట్ అయిన అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం సహాయం అందిస్తుందని వెల్లడించడమే కాకుండా, రూ.15వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారాన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అందిస్తామని తెలిపారని అన్నారు. కేంద్రం ప్రకటించిన సహకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కూటమి సాధించిన తొలి విజయమే అని వారు పేర్కొన్నారు.
ఏపీ 20ఏళ్లు వెనక్కి పోయింది
కేంద్రం బడ్జెట్‌పై టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాధ్యానత లభించింది. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభ్యమైంది. కేంద్రం బడ్జెట్‌లో చేసిన ప్రకటనల ద్వారా 5కోట్ల మంది ఆంధ్రులు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కువెళ్లింది. కేంద్రం సహాయం అందించకపోతే రాష్ట్రం ఎంతో నష్టపోయేది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎన్నికల ముందే చెప్పాం. అమరావతికి 15 వేల కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధిని జగన్ అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా జగన్ దెబ్బతీశారు. కానీ పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ మొదటి అడుగు
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం ఈ బడ్జెట్ ద్వారా జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యానించారు. సంక్షేమం కావాలి.. అలాగే దాంతోపాటు ఉపాధి కల్పన కూడా జరగాలన్నారాయన. ‘‘ఉపాధి కల్పనపై బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌లో కూడా ఏపీ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడలేదు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఫలితమే ఇది. అమరావతికి రూ.15వేల కోట్లు వచ్చాయి. పోలవరానికి కూడా పెరిగిన వ్యయాన్ని కూడా అందించమని కోరుతున్నాం. ఏపీకి పరిశ్రమలు రావాలని కోరగా.. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ ఇచ్చారు. ఇది చాలా ఉపయోగకరం. పూర్వోదయ స్కీమ్ ద్వారా తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధితో పాటు ఏపీ అభివృద్దికి కూడా తోడ్పాలు లభించనుంది’’ అని వ్యాఖ్యానించారాయన.
‘‘కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్ర ప్రజలకు కొంత ఉపశమనం దొరికింది. ఏపీ ప్రజల ఆకాంక్షల దిశగా ఈ బడ్జెట్ ఒక ముందడుగు. ఇటువంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధానిమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయిన హైదరాబాద్ ద్వారా ఇప్పుడు తెలంగాణ ఆదాయం పొందుతోంది. అలాంటి నగరం ఏపీకి లేదు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అమరావతి వల్ల రాష్ట్రానికే కాదు యావత్ దేశకి కూడా లాభముంటుంది. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంతో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదే అంశంలో చంద్రబాబు అద్భుతంగా పనిచేశారు’’ అని అన్నారు.