అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు : ఏపీ హోం మంత్రి అనిత
అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు తీసుకుంటామని వడ్డీ వ్యాపారులను ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత హెచ్చరించారు.
వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. కుస్తీలకు ముందే వడ్డీ కోతతో పాటు గడువు దాటిందనే సాకుతో డబుల్ కుస్తీలు వసూలు చేసే కాల్ మనీ వ్యాపారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లకు పాల్పడి వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. వసూళ్ల పేరుతో అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎస్పీతో హోంమంత్రి అనిత మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారాలపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు.