అక్టోబర్ 10న ఏపీ కేబినెట్.. పలు అంశాలపై కీలక చర్చలు, నిర్ణయాలు
చెత్త పన్ను రద్దు, ఉచిత గ్యాస్ సిలీండర్లు వంటి పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-10-02 13:44 GMT
అక్టోబర్ 10న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఇంత వరకు కేవలం పెన్షన్‌ల పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. వెయ్యి రూపాయిలు అధనంగా పెంచి నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు పెంచిన వెయ్యి రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేలను లబ్ధిదారులకు అందిస్తున్నారు. తక్కిన పథకాల ప్రస్తావన రాలేదు.
ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ఇంత వరకు ఎన్నికల అజెండాలో పేర్కొన్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చించనున్నారు. అందులో భాగంగా ఉచిత గ్యాస్ íసిలీండర్ల పథకం పురుడు పోసుకోనుంది. ఇంటికి ఏడాదికి మూడు ఉచిత సిలీండర్లు ఇస్తామని ప్రకటించారు. మంగళవారం కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు దీని గురించి ప్రస్తావించారు. దీపావళికి ఉచిత గ్యాస్ సిలీండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. దీనిపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా చెత్త పన్ను మీద కూడా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
బుధవారం మచిలీపట్నం పర్యటనలో సీఎం చంద్రబాబు చెత్త పన్ను గురించి మాట్లాడారు. నేటి నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయరాదని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిపైన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చెత్త పన్ను రద్దుకు ఆమోద ముద్ర వేయనున్నారు. వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు, ఇంటింటికి మంచి నీటి పంపిణీపైన కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అక్టోబరు 10 గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుందని, ఈ నేపథ్యంలో కేబినెట్ హ్యాండ్ బుక్ ఫార్మేట్ రూపంలో ప్రతిపాదనలను తయారు చేసి అక్టోబరు 8 మంగళవారం సాయంత్రం 4గంటలకల్లా పంపాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.