టీడీపీ సభ్యత్వం 73 లక్షలు
ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అత్యధికంగా నమోదు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది. పదవుల కేటాయింపులు కూడా ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.;
సభ్యత్వంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆసక్తి కనబరిచారు. అధికారంలో ఉండటంతో సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కట్టారు. ఇప్పటి వరకు దాదాపు 73లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు. సభ్యత్వంలో ఎక్కువుగా యువత, మహిళలు ముందుకొచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పంతో పాటు మంగళగిరి నియోక వర్గాల్లో అధికంగా నమోదు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అత్యధికంగా సభ్యత్వం నమోదైంది. కుప్పం, మంగళగిరితో పాటుగా రాజంపేట, నెల్లూరు. పాలకొల్లు అసెంబ్లీ నియోజక వర్గాలు టాప్ 5లో నిలిచాయి.
శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు పార్టీ సభ్యత్వ నమోదుపైన సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో నమోదు జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నూతన సభ్యత్వం పెరగడంతో పాటుగా యువత, మహిళల సభ్యత్వాలు అధికంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. పార్టీ కేడర్ సంక్షేమంతో పాటు వారి ఎదుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే పనితీరుపైన ఆయన మాట్లాడుతూ.. కేడర్ పని తీరు ఆధారంగా పదవుల్లో గుర్తింపు ఉంటుందన్నారు. పని తీరు ప్రామాణికంగా పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు. ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని, పార్టీ తరఫున ప్రజలకు సేవలు చేయకుండా పదవులు ఇవ్వమంటే సాధ్యం కాదన్నారు. కష్టపడే వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయన్నారు. పదవులు తీసుకున్న తర్వాత కొంత మంది పార్టీని నిర్లక్ష్యం చేసుకున్నారని, ఎమ్మెల్యేలు అయ్యాయమని మరి కొంత మంది ఇదే ధోరణితో ఉంటున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని, లేకుంటే అవకాశాలు రావని సూచించారు.