టార్గెట్ పెద్దిరెడ్డి, బాలినేని

భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై స్వేతపత్రం. ఇందులో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు ప్రధాన టార్గెట్. ఎందుకు?.

Update: 2024-07-16 01:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో భూ దందాలు, సహజ వనరులు దోపిడీ చేసిన వారిలో ఇద్దరు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల పేర్లను ముఖ్యమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో భూదందాలు జరిగాయని, అలాగే బాలినేని ఇలాఖాలోనూ భూములు స్వాహా చేశారని, ఒంగోలులో రూ. 101 కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో స్వాహా చేసేందుకు యత్నించారని, వారిపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలకు అంతులేకుండా పోయిందని వైట్ పేపర్ లో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 22ఎ పెట్టి 782 ఎకరాలు కాజేసేందుకు యత్నించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరు ఇలా చేశారనేది మాత్రం స్వేతపత్రంలో పేర్కొన లేదు. పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు. పేదవారి అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ వారు లాక్కున్నారని సీఎం పేర్కొన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని కాకుండా వేరే వారిని టార్గెట్ చేసే అవకాశం లేదు. ఎకరా రూ. 40వేల వంతున వైఎస్సార్సీపీ వారికి 13,800 ఎకరాలు ధారాదత్తం చేసినట్లు లెక్కలు చూపించారు.

ఇవన్నీ చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్నట్లు వెల్లడించడం విశేషం. గనులు, అటవీ శాఖలను సాధారణంగా ఒకే వ్యక్తికి ఇవ్వరు.. కానీ ఒకే వ్యక్తికి ఈ రెండు శాఖలు కేటాయించి మంత్రి పదవి ఇచ్చారు. ఇసుక దందాలో ఇప్పటి వరకు రూ. 9,750 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు వైట్ పేపర్ లో పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేయించి క్వారీ యజమానులను భయబ్రాంతులకు గురిచేశారు అంటూ ఇరువురిని టార్గెట్ చేశారు. సీఎం చంద్రబాబు.

బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం ఒంగోలు వచ్చి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను ఎక్కడైనా కబ్జాలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఒంగోలులో నిర్మించే విల్లాలోకి టీడీపీ వారు చొరబడటాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నారు. మరో సారి ఇలా జరిగితే చెప్పుతో కొడతానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. బాలినేని శ్రీవాసరెడ్డి ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ నుంచి తిరిగి ఈనెల 15న ఒంగోలు వచ్చిన బాలినేని ఓటమిని చూసిన తరువాత రాజకీయాల నుంచి కొంత కాలం తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ వారు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులను చూసి ఓపిక పట్టలేక రంగంలోకి దిగినట్లు చెప్పారు. తాను పార్టీ మారుతున్నాననేది కేవలం ప్రచారమేనని కొట్టివేశారు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ముందుగా ఇలా లీకులు ఇవ్వడం, ఆ తరువాత నిర్ణయాలు తీసుకోవడం బాలినేని మొదటి నుంచీ చేస్తున్నదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పెద్దిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డాడని సీఎం చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఆయన చేసిన మంత్రి పదవులను ప్రస్తావించారు. భూములు కాజేసేందుకు యత్నించారని, తిరుపతి జిల్లాలో భూ ఆక్రమణలకు లెక్కే లేదని పేర్కొన్న సీఎం ఒక్కదానిపైన కూడా విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పలేదు. దొంగకే తాళాలు ఇవ్వడం ద్వారా అటవీ సంపదను దోచుకున్నారన్నారు. ఎర్రచందనం దోపిడీ చేశారన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భూ దందాలు, సహజ వనరుల దోపిడీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందనేది ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పన మాట. ఆయనపై కేసులు ఎక్కడా నమోదు కాలేదు. పైగా విచారణకు కూడా ఆదేశించలేదు. కేవలం ఒంగోలు అంశంపై మాత్రమే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఇక విశాఖపట్నంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అరాచకాలు, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

సహజ వనరులను దోపిడీ చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ప్రముఖ పాత్ర ఉన్నట్లు చంద్రబాబు విడుదల చేసిన స్వేతపత్రంలో కనిపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములు స్వాహా చేసిందని, సహజ వనరులను దోచుకుని ప్రజలకు అన్యాయం చేయడంలో పెద్దిరెడ్డి పాత్రనే ఎక్కువగా సీఎం ప్రస్తావించారు. గనులు, అడవుల ద్వారానే ఎక్కువ దోపిడీ జరిగిందనేది సీఎం స్వేత పత్రంలో చెప్పిన మాట. కాగా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు జరిగాయని చెప్పుకొచ్చారు.

స్వేతపత్రంలో బాలినేని  శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు టార్గెట్ కావడం దేనికి సంకేతమనే చర్చ  మొదలైంది. వీరిలో బాలినేని ముఖ్యమంత్రికి బంధువు కావడం, పెద్దిరెడ్డి పార్టీలో అన్నీ తానై పనిచేయడమే కాకుండా పార్టీని ఆర్థికంగా ఆదుకునే విషయంలో ముందున్నారని, వీరిని టార్గెట్ చేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు భావించినట్లు సమాచారం. చివరకు ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News