పులివెందులలో రాళ్లతో దాడి
వాహనాలు ధ్వంసం కాగా వైసీపీ ఎమ్మెల్సీతో పాటు పలువురికి గాయాలయ్యాయి.;
By : The Federal
Update: 2025-08-06 10:43 GMT
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగంగా మారాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, వైసీపీ వర్గాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లిలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకుడు వేల్పుల రాముపై ప్రత్యర్థ పార్టీకి చెందిన శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న రమేష్ యాదవ్, రాములపై ప్రత్యర్థ పార్టీకి చెందిన శ్రేణులు దాడికి దిగారు. ఈ దాడిలో నాలుగు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిని వేల్పుల రామును పోలీసులు తమ వాహనంలోనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఈ దాడి ఘటనతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ దాడి ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తమ గ్రామాల్లో ఏ పార్టీ నాయకులు రావద్దని, తామే ఓట్లేస్తామని చెబుతున్నా.. రాజకీయ పార్టీల శ్రేణులు ఓటర్లను పెట్రోల్ పోసి భయపెడుతున్నారని మండిపడుతున్నారు.