తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

Update: 2024-10-07 13:06 GMT


తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు


శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు సోమ‌వారం తిరుమలకు చేరుకున్నాయి.
ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :

ఆండాళ్ మాల - షికామణి మాల అని కూడా పిలువబడే రెండు దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.


Tags:    

Similar News