తిరుమలలో ఆణివార ఆస్థానంలో శ్రీరంగం సారె సమర్పణ
తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి, తిరుమల మధ్య అనుబంధం ఎందుకు ఏర్పడింది?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-16 09:10 GMT
తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంతో తిరుమల శ్రీవారి క్షేత్రానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. వందల ఏళ్ల నాటి నుంచి ఈ రెండు ఆలయాల అనుబంధాన్ని అధికారులు కూడా కొనసాగిస్తున్నారు. తిరుమలలో ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కార్తీకమాసం తరువాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరంగం ఆలయానికి తిరుమల నుంచి టీటీడీపీ అధికారులు పట్టువస్త్రాలు సమర్పిస్తుంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోకి పట్టువస్త్రాలు తీసుకుని వస్తున్న శ్రీరంగం ఆలయ ప్రధాన అర్చకుడు సుందర బట్టర్
ఎందుకీ అనుబంధం..
దేశంలోని శ్రీవైష్ణవాలయాలకు కేంద్రం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం కావడం ప్రస్తావనార్హం. అయితే, ఔరంగజేబు కాలంలో జరిగిన దండయాత్ర చరిత్రలో ఉంది. ఆ దండయాత్ర నుంచి శ్రీరంగనాథుడిని కాపాడాలని ప్రయత్నించారు. అందులో భాగంగా ఉభయదేవేరుల తోపాటు శ్రీరంగనాథుడి విగ్రహాన్ని తిరుమలకు తీసుకుని వచ్చి భద్రపరిచారు.
ఈ విషయం తెలిసిన ఔరంగజేబు తిరుమలలో దండయాత్రకు బయలుదేరి తిరుపతికి చేరుకున్నారట. ఆ సమయంలో హిందూ, ముస్లింలు ఔరంగజేబు సైన్యాన్ని నిలువరించి, బీబీనాంచారి పాత్ర సృష్టించారని చెబుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ముస్లింలకు అల్లుడిగా వర్ణించిన తీరుతో ఔరంగజేబు వెనక్కి తగ్గి, శ్రీవారికి కానకలు సమర్పించి, తప్పు తెలుసుకుని వెనుదిరిగినట్లు కథనం. ఆ కాలం నాటి ఆభరణాలు తిరుమలలో భద్రంగా ఉన్నాయి. ఉత్సవాల సందర్భంగా అలంకరిస్తుంటారు. పరిస్థితి చక్కబడడంతో..
శ్రీరంగనాథుడి తోపాటు ఉభయ దేవేరుల విక్రమాలను శ్రీరంగం తీసుకుని వెళ్లారు. దీంతో ఆనాటి నుంచి శ్రీరంగం శ్రీరంగనాథుడి ఆలయం - తిరుమల శ్రీవారి క్షేత్రం మధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. అ అనుబంధాన్ని ఓ ఆచారంగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఆణివారం ఆస్థానం కోసం..
తిరుమల జీయర్ మఠంలో శ్రీరంగం నుంచి తీసుకుని వచ్చిన సారె
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా బుధవారం శ్రీరంగం నుంచి ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, పండ్లు, తీసుకుని వచ్చారు. ఆలయ అధికారులు తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీధరన్ తో కలిసి వచ్చారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న తిరుమల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె. శ్యామలరావు, తమిళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీధరన్ మిగతా అధికారులను వెంట తీసుకుని వారు తీసుకుని వచ్చిన పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ అదనపు కార్యదర్శి మణివాసగం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుందర బట్టర్ తదితరులు పాల్గొన్నారు.