డెడ్‌బాడీ పార్శిల్ గుట్టు రట్టు..అడిగేవారు లేరని పర్లయ్యను చంపారు
అక్క ఆస్తిని నొక్కేయాలని ప్లాన్ చేసి బొక్క బోర్ల పడ్డారు. చెల్లి, చెల్లి భర్త, అతని ప్రియురాలు నిందితులుగా తేలారు. చివరకు కటకటాల పాలయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంద్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ పార్శిల్ కేసు గుట్టు రట్టైంది. ఇంటికి కరెంట్ సామాగ్రి కావాలంటే శవంతో కూడిన పార్శిల్‌ను పంపిన కేసు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో చోటు చేసుకుంది. దీనిని చాలెంజ్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిగ్గు తేల్చారు. కేసు వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ శుక్రవారం వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 19న రంగంలోకి దిగారు.ఉండి మండలం యండగండిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మల పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. పార్శిల్‌లో శవం రావడంతో..ఇది ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపైన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఉండి మండలం యండగండికి చెందిన రంగరాజుకు తులసి, రేవతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. తులసికి పెళ్లైనా భర్త వదిలేశాడు. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లైంది. అయితే తండ్రి రంగరాజుకు 2.5 ఎకరాల పొలంతో పాటు స్థలం కూడా ఉంది. దీంతో పాటుగా కొంత బంగారం కూడా ఉంది. రంగరాజు ఆస్తిపైన శ్రీధర్ వర్మ కన్ను పడింది. ఆస్తి అంతా తానే నొక్కేయేలని ప్లాన్ చేశాడు.
దాదాపు జూన్ నుంచి పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలో తులసిని భర్త వదిలేయడంతో ఆమె అవసరాలను ఆసరాగా తీసుకుని ఈ కుట్రలు పన్నాడు శ్రీధర్ వర్మ. ఈ కుట్రలో తులసిని ఇరికించాలని ప్లాన్ చేశాడు. దీనికి ఖతర్నాక్ ప్లాన్ చేశాడు. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న తులసికి క్షత్రియ సేవా సమితి ద్వారా సహాయం చేస్తున్నట్లు నమ్మించారు. శ్రీధర్ వర్మ, రేవతిలు కలిసి ఈ నాటకాలాడారు. అందులో భాగంగా క్షత్రి సేవా సమితి నుంచి ఇంటి నిర్మాణం కోసం తులసికి కొన్ని వస్తువులు పంపారు. ఈ సారి కరెంట్ సామాను కోసం క్షత్రి సేవా సమితిని తులసి కోరింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం శ్రీధర్ వర్మ, రేవతిలు కలిసి డెడ్ బాడీతో కూడిన పార్శిల్‌ను తులసికి పంపారు. డిసెంబరు 19న ఇది జరిగింది. ఎందుకు ఇలా చేశారంటే.. శవాన్ని పంపడం ద్వారా తులసిని బెదిరించి.. భయపెట్టి ఆస్తి జోలికి రాకుండా చేసేందుకు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఎవరి శవాన్ని పంపాలని అనుకున్నప్పుడు కాళ్ల మండలానికి చెందిన పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నారు. పర్లయ్యను చంపితే అడిగేవారు ఉండరు అనే ఉద్దేశంతో కిరాతకంగా పర్లయ్యను చంపేశారు. శ్రీధర్ వర్మ ప్రియురాలు పొలంలో తాగి ఉన్న సమయంలో పర్లయ్యను నైలాన్ తాడుతో గొంతుకు బిగించి చంపేశారు. పర్లయ్యకు ముందుగా వేరే వ్యక్తిని చంపాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత వారి ప్లాన్‌ను మార్చుకున్నారు. దాదాపు 100 మంది పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తులు చేపట్టారని ఎస్పీ నయీం అస్మీ చెప్పారు.