Telangana 2024 | కాంగ్రెస్, బీజేపీలకు రాజపూజ్యం...బీఆర్ఎస్ కు అవమానం

ఏడాడి పాలనలో రేవంత్ కు ప్లస్సులున్నట్లే మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. హోలుమొత్తంమీద 2024 పొలిటికల్ రౌండప్ ఈ విదంగా ఉంది.

Update: 2024-12-28 04:30 GMT

2023-24 తెలంగాణాలో అనూహ్య మార్పులు జరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు, బీజేపీ పుంజుకోవటం కీలకమైన అంశాలుగా చెప్పుకోవాలి. 2024 పార్లమెంటు ఎన్నికలతో బీఆర్ఎస్ పాతాళానికి పడిపోతే కాంగ్రెస్, బీజేపీలు బాగా పుంజుకున్నాయి. 2001 నుండి తెలంగాణాలో అంతా తానై కనిపించిన కేసీఆర్ 2023-24 ఎన్నికల దెబ్బకు జనజీవనస్రవంతికి దూరమైపోవటం చాలాకీలకమని చెప్పాలి. ఇదేసమయంలో 2024 సంవత్సరాన్ని రేవంత్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఏడాడి పాలనలో రేవంత్ కు ప్లస్సులున్నట్లే మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. హోలుమొత్తంమీద 2024 పొలిటికల్ రౌండప్ ఈ విదంగా ఉంది.

రాజపూజ్యం, అవమానం అంటే ఇదేదో వారఫలాలో లేకపోతే పంచాగశ్రవణమో కాదు. తెలంగాణాలో రాజకీయపార్టీల ప్రస్తుత పరిస్ధితి. తెలంగాణాలో చాలా పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ గురించే. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లకు రాజపూజ్యం అని అన్నది ఎందుకంటే 2023 నవంబర్-డిసెంబర్లో మొదలైన ఈ పార్టీల జోరు 2024లో కూడా కంటిన్యుఅయ్యింది కాబట్టే. ఇదేసమయంలో 2023లో ఓటమితో దెబ్బతిన్న బీఆర్ఎస్(BRS) పార్టీ పరిస్ధితి 2024 పార్లమెంటు ఎన్నికల్లో మరింతగా దిగజారిపోయింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు సీట్లలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా కారుపార్టీ గెలవలేదు. కాంగ్రెస్, బీజేపీలు చెరి 8 సీట్లను గెలుచుకోగా మిగిలిన సీటును ఎంఐఎం గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో కారు బొక్కబోర్లా పడటంతో పార్టీఇమేజి పాతాళానికి పడిపోయింది. పాతాళానికి పడిపోయిన ఇమేజీని లేపటానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు నానా అవస్తలుపడుతున్నారు. 



 పైవిషయాలనే వివరంగా చెప్పుకుంటే 2014 తెలంగాణా విభజనతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్ళపాటు ఎదురులేకుండా పాలించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) తన చాణుక్యంతో ప్రతిపక్షాలను అంటే టీడీ(TDP)పీ, కాంగ్రెస్ ను చీల్చి చెండాడేశారు. కేసీఆర్ దెబ్బకు టీడీపీ అసలు ఉనికిలో కూడా లేకుండాపోయింది. అసెంబ్లీలో టీడీఎల్పీ, సీఎల్పీలను కేసీఆర్ తనపార్టీలో విలీనంచేసేసుకున్నారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేసినట్లే కాంగ్రెస్ ను కూడా చేయాలని చాలా ప్రయత్నాలుచేసినా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ వానపాములాంటిదన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. వానపామును రెండుగా నరికేసినా చెరోముక్కా చెరోవైపుకు పాకుతు వెళ్ళిపోతాయి. వానపామును చంపాలంటే దాన్ని చితక్కొట్టేసి భూమిలో కప్పెట్టేయాలంతే. కాంగ్రెస్ ను చితకొట్టేసి భూమిలో కప్పెట్టడానికి కేసీఆర్ శక్తి సరిపోలేదు. దాని ఫలితమే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవటం ఖాయమని కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ తదితరులందరు అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఎన్నికలకు చివరి నెలరోజుల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుని కేసీఆర్ కు పెద్ద షాకిచ్చింది.


తెలంగాణా సాధనకోసం 2001లో బీఆర్ఎస్ పెట్టిన దగ్గరనుండి 2023 ఎన్నికల వరకు తెలంగాణా రాజకీయాలు మొత్తం కేసీఆర్ చుట్టూనే తిరిగాయి. 2014లో తెలంగాణా ఏర్పడక ముందు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు గెలుపు, ఓటములు అనుభవమే. 2004-09 మధ్య వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ హవా తగ్గింది. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ప్రత్యేక తెలంగాణా వాదం ఉవ్వెత్తున పైకిలేచింది. అక్కడినుండి 2023 ఎన్నికల్లో ఓటమివరకు కేసీఆర్ ప్రభ ఓ రేంజిలో వెలిగిపోయింది. అలాంటి కేసీఆర్ కు మొదటి దెబ్బ అసెంబ్లీ ఎన్నికలైతే తర్వాత దెబ్బ పార్లమెంటు ఎన్నికల్లో జీరో ఫలితాలు.

కేసీఆర్ ఇబ్బందులు


ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి రెండు ఇబ్బందికరమైన అంశాలున్నాయి. అవేమిటంటే మొదటిది పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం. రెండో అంశం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రవ్వటం. కాంగ్రెస్ అధికారంలోకి రావటంకన్నా రేవంత్ సీఎం అవ్వటమే కేసీఆర్ ను ఎక్కువ ఇబ్బందిపెడుతోంది. అందుకనే రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే కారుపార్టీ నేతలు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రతిరోజు టైంటేబుల్ వేసుకున్నట్లుగా కేటీఆర్(KTR), హరీష్(Harish) అయినదానికి కానిదానికి రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. తమహయాంలో జరిగిన తప్పులకు కూడా ప్రస్తుత రేవంత్ ప్రభుత్వాన్నే తప్పుపడుతున్నారు. సంక్షేమహాస్టళ్ళను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటంలేదని రోజు గోలగోల చేస్తున్నారు. పదేళ్ళు అధికారంలో ఉండి మీరెందుకు బాగుచేయలేదన్న మంత్రుల ఎదురుదాడికి సమాధానం చెప్పలేకపోతున్నారు.

సంక్షేమ వివాదం


సంక్షేమహాస్టళ్ళల్లో పిల్లలకు నాసిరకం భోజనాలు పెడుతున్నారన్న కేటీఆర్, హరీష్ ఆరోపణలను కూడా మంత్రులు తిప్పికొడుతున్నారు. ఎలాగంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమహాస్టళ్ళల్లో పిల్లల డైట్ ఛార్జీలను పెంచలేదన్న అంశాన్ని ఆధారాలతో సహా మంత్రుల ఎదురుదాడులకు కేటీఆర్, హరీష్ సమాధానాలు చెప్పటంలేదు. ఇపుడు హాస్టళ్ళల్లోని పిల్లలు కొందరు చనిపోయినట్లే బీఆర్ఎస్ హయాంలో కూడా చనిపోయారు. ఇక కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల్లో అవినీతి, అక్రమాలు, విద్యుత్ కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల ఏర్పాటులో అక్రమాలు, టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) పై రేవంత్, మంత్రుల ఆరోపణలు కేటీఆర్, హరీష్ ను ఇరుకునపెడుతున్నాయి. విద్యుత్ రంగంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం జస్టిస్ మదన్ బీ లోకూర్ తో విచారణ చేయించింది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ తో విచారణ చేయిస్తోంది. ఇప్పటికే మదన్ బీ లోకూర్ సమర్పించిన నివేదిక ప్రభుత్వం దగ్గరుంది. ఈ నివేదిక ఆధారంగా రేవంత్ యాక్షన్ తీసుకోవటం మొదలైతే ముందు కేసీఆర్ దగ్గర నుండే మొదలవుతుంది. అప్పుడు కేసీఆర్ తో పాటు హరీష్ మీద కూడా కేసులు, విచారణ తప్పకపోవచ్చు.

కేటీఆర్ ను చుట్టుకోబోతున్న ‘ఫార్ములా’


ఇదేసమయంలో ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Race) ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ మీద కేసు నమోదుచేసింది. ఒకటిరెండు రోజుల్లో విచారణకు నోటీసులు జారీచేసే అవకాశముంది. విచారణ తర్వాత అరెస్టుకూడా ఉంటుందనటంలో సందేహంలేదు. అరెస్టు అయ్యే విషయంలో ఇప్పటికే కేటీఆర్ కూడా మానసికంగా సిద్ధంగానే ఉన్నారు. తనను ఏదో కేసులో ప్రభుత్వం అరెస్టుచేయటం ఖాయమని ఆమధ్య కేటీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో అవినీతి, అక్రమాలపై కేసీఆర్, హరీష్, ఫార్ములా కార్ రేసులో అవినీతిపై కేటీఆర్ అరెస్టయితే అప్పుడు బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటన్న టెన్షన్ నేతల్లో పెరిగిపోతోంది. కేసీఆర్ కూతురు కవిత(Kavitha) యాక్టివ్ గా ఉన్నారని అనుకున్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో అరెస్టయి ఆరుమాసాలు ఢిల్లీలోని తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అతికష్టంమీద బెయిల్ తెచ్చుకుని కవిత బయట తిరుగుతున్నారు. బెయిల్ గనుక రద్దయితే కవిత మళ్ళీ తీహార్ బాట పట్టకతప్పదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీపరిస్ధితి చుక్కానిలేనినావలాగ అయిపోతుందనటంలో సందేహంలేదు.

సడెన్ గా పుంజుకున్న కాంగ్రెస్


ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రెండువరుస ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ మూడోఎన్నికలో కూడా ఓడిపోయుంటే పరిస్ధితి చాలా ఘోరంగా ఉండేది. అందుకనే ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలను గుప్పించింది. కర్నాటకలో ఇచ్చిన హామీలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ వరకు ఉచితం హామీ ఇక్కడా ఇచ్చింది. వీటికి అదనంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, అర్హులైన మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్, రైతురుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిధిని రు. 15 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే మహిళలకు తులంబంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, క్రమంతప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, స్ధానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లాంటి అనేక ఆచరణసాధ్యంకాని హామీలిచ్చింది. ఇచ్చినహామీలను అమలుచేయలేక ఇపుడు అవస్తలు పడుతోంది. విచిత్రం ఏమిటంటే వట్టిపోయిన ఖజానాను వారసత్వంగా కేసీఆర్ ప్రభుత్వం తమకు అప్పగించిందని రేవంత్ ఇపుడు గోలపెడుతున్నారు.

రేవంత్ అప్పుల గోల


ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న విషయం అందరికీ బాగాతెలుసు. లక్షలకోట్ల రూపాయలు అప్పులున్నాయని తెలిసినా ప్రభుత్వంపై మరింతగా భారంవేసే హామీలను రేవంత్ ఎందుకు ఇచ్చినట్లు ? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయటంలేదంటు బీఆర్ఎస్, బీజేపీలు రేవంత్ ను గట్టిగా తగులుకుంటున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ప్రతిపక్షాలపై రేవంత్ ఒక్కోసారి అదుపుతప్పి నోటికి పనిపెడుతున్నాడు. ఉన్నసమస్యలు చాలవన్నట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల పరిరక్షణ పేరుతో ఏర్పాటుచేసిన హైడ్రా చర్యలతో రేవంత్ కే తలనొప్పిగా మారింది. అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కూడా రేవంత్ కు పెద్ద సమస్యగా మారింది. మూసీనదికి రెండువైపులా దశాబ్దాలుగా నివాసముంటున్న లక్షలమందిని ఖాళీచేయించాలంటే ఎంతపెద్ద కసరత్తు అవసరం ? అయితే అలాంటి కసరత్తు ఏమీచేయకుండానే ఉన్నపళాన నివాసితులను ఖాళీచేసేయాలని ఇళ్ళ కూల్చివేతలకు ప్రభుత్వం దిగటం పెద్ద సంచలనమైపోయింది.

రేవంత్ కు హైడ్రా, మూసీ తలనొప్పులేనా ?


ఇళ్ళను కూల్చేయాలని అనుకున్న రేవంత్ ప్రభుత్వం ముందుగా ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులతో చర్చించాలి. వారిద్వారా నివాసితులతో మాట్లాడించి ఒప్పించాలి. వాళ్ళ డిమాండ్లను సానుభూతిలో పరిశీలించాలి. ఆచరణ సాధ్యమైన డిమాండ్లను వెంటనే అంగీకరించి ఆచరణలో చూపించాలి. అప్పుడే నివాసితుల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఇదేమీ లేకుండా తాను మోనార్కునని అనుకున్న రేవంత్ తాను చెప్పింది చేయాల్సిందే అన్నట్లుగా వ్యవహరించాడు. దాంతో బాదితుల్లో కొందరు కోర్టుకెక్కటంతో వెంటనే స్టే వచ్చింది. దాంతో ఇళ్ళు ఖాళచేయించే ప్రక్రయకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈమధ్యనే కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. నివాసితులతో చర్చించి వాళ్ళ న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం ఇపుడు నివాసితులతో చర్చలు మొదలుపెట్టింది. రేవంత్ ఏడాది పాలనపై ప్రశంసలున్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. మైనస్సులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫార్మా పరిశ్రమ కోసం లగచర్ల గ్రామంలో భూసేకరణ వివాదం. గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు, రైతులు చేసిన దాడి రాష్ట్రంలోనే సంచలనమైపోయింది. అయితే దాడిచేసిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు వాళ్ళ ఇళ్ళపై పోలీసులు చేసిన దాడులు, పోలీసుస్టేషన్లో పెట్టి ఆడవాళ్ళని, చిన్నపిల్లలతో పాటు ముసలివాళ్ళని పెట్టిన హింసలు వెలుగుచూడటంతో రేవంత్ కు బాగా చెడ్డపేరొచ్చింది. ఏడాది చివరినెలలో సంధ్యా ధియేటర్లో పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మరణించింది. తొక్కిసలాటలో ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఘటనకు కారకుడన్న ఆరోపణపై అల్లుఅర్జున్(AlluArjun Arrest) పై పోలీసులు కేసుపెట్టి అరెస్టు చేయటం సంచలమైపోయింది. ఈ విషయంలో మెజారిటి జనాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవటం కొసమెరుపు.

బీజేపీలో జోష్ ఏమైంది ?


ఇక బీజేపీ గురించి చెప్పుకోవాలంటే రెండు ఎన్నికల్లోను లబ్దిపొందింది. 2023 అసెంబ్లీ ఎన్నికలనాటికి నలుగురు ఎంఎల్ఏలుంటే ఎన్నికల తర్వాత ఆ సంఖ్య 8కి పెరిగింది. అంటే ఎంఎల్ఏల సంఖ్యను నూరుశాతం పెంచుకున్నట్లే. అలాగే 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందున్న నలుగురు ఎంపీల సంఖ్యను ఎన్నికల్లో 8కి పెంచుకున్నది. ఈ విధంగా రెండుఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను రాబట్టుకున్నట్లే. అయితే ఎన్నికలసమయంలో కనిపించిన జోష్ తర్వాత ఏమైందో అర్ధంకావటంలేదు. స్వతహాగా మెతకగా ఉండే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రఅధ్యక్షుడిగా లాభంలేదని పార్టీలోని చాలామంది నేతల్లో అసంతృప్తి కనబడుతోంది. కిషన్ రెడ్డి పనితీరును అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్ పనితీరుతో పోల్చిచూడటమే పెద్ద సమస్యగా మారింది. 2029ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని ఉవ్విళ్ళూరుతున్న కమలంపార్టీకి అంతసీనుందా అనేసందేహాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి వచ్చిన 75 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వాలుగా మార్చుకోవాలని పార్టీ జాతీయ నాయకత్వం టార్గెట్ గా పెట్టింది. అయితే మూడునెలలు నానా అవస్ధలుపడితే అయ్యింది సుమారు 30 లక్షల సభ్యత్వాలు మాత్రమే. అదికూడా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని కొరడాపట్టుకుని వెంటపడితేనే. బీజేపీకి అతిపెద్ద సమస్య ఏమిటంటే 119 నియోజకవర్గాల్లో చాలాచోట్ల క్షేత్రస్ధాయిలో బలంలేకపోవటమే. ఒక అంచనా ప్రకారం సుమారు 85 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీల నేతలను ఢీకొట్టేంత బలమైన నేతలు పార్టీలో లేరు. బలమైననేతలను తయారుచేసుకోవటం కష్టమని భావించిన జాతీయనాయకత్వం ఇతరపార్టీల నుండి వలసలను యధేచ్చగా ప్రోత్సహిస్తుంది. దాంతో వలసనేతలకు, పార్టీలోనే సంవత్సరాలుగా ఉన్న ఒరిజినల్ నేతలకు చాలా నియోజకవర్గాల్లో పడటంలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నకారణంగా తెలంగాణాలో పార్టీ నేతలు ఏదోరకంగా నెట్టుకొచ్చేస్తున్నారు. పై మూడుపార్టీలకు క్షేత్రస్ధాయిలో ఉన్న బలమెంత అన్నది తేలాలంటే తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలవరకు వెయిట్ చేయాల్సిందే.

ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం


పై మూడుపార్టీలంత స్ట్రాంగ్ కాకపోయినా ఎంతోకొంత ప్రభావం చూపగలిగిన పార్టీ ఏఐఎంఐఎం(AIMIM). హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ఎంఐఎం పార్టీ స్ధిరమైన ఫలితాలు సాధిస్తోంది. తెలంగాణా మొత్తంమీద ఓల్డ్ సిటీలోని ఏడెనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే ఎంఐఎంకు పట్టుంది. ఇందులో ప్రతి ఎన్నికలోను కచ్చితంగా ఆరు నియోజకవర్గాల్లో గెలుస్తోంది. దాంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఏ పార్టీకైనా ఎంఐఎం అవసరం ఉంటోంది. అందుకనే అధికారంలోకి రాబోయేపార్టీతో స్నేహం చేయటంద్వారా ఎంఐఎం ఓల్డ్ సిటీలో తన పట్టును నిలుపుకుంటోంది. గడచిన ఐదారుఎన్నికల్లో ఎంపీగా అసద్, చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏగా సోదరుడు అక్బురుద్దీన్ గెలుస్తున్నారంటే పార్టీకి ఉన్న పట్టేంటో అర్ధమైపోతోంది. చివరగా, నెలమట్టమైపోయిన టీడీపీకి జవసత్వాలు అందించి మళ్ళీ పైకిలేపాలని చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరీప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.

Tags:    

Similar News