ఇంటి పోరు పడలేకే ఇంతియాజ్ రాజీనామా!
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఇందుకు పార్టీలోని వర్గపోరే కారణమని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
రాజకీయాలపై పెద్దగా అనుభవం లేదు. కుళ్లు రాజకీయాల గురించి అసలు తెలియదు. గెలిస్తే ప్రజాసేవ చేద్దామనుకున్నారు. కానీ ప్రజలు ఓడించారు. అయినా పరవాలేదు, పార్టీలో ఉంటూ ప్రజలకు చేరువ కావాలనుకున్నారు. అయితే సొంత పార్టీ వారి నుంచి కనీస సహకారం లేదు. దీంతో ఆరు నెలలుగా విసిగి పోయాడు. చేసేది లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు షేక్ ఇంతియాజ్. తనకు రాజకీయాలపై పెద్దగా ఇష్టం లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీ అధ్యక్షునికి రాజీనామా లేఖ రాస్తూ తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు..
మాజీ ఐఏఎస్ అధికారి షేక్ ఇంతియాజ్ 2024 ఎన్నికలకు ఒక నెల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయనకు జగన్ అవకాశం కల్పించారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన షేక్ హఫీజ్ ను కాదని ఇంతియాజ్ ను అభ్యర్థిగా పోటీకి దింపారు. అప్పటి వరకు పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిని కాదని ఇంతియాజ్ కు టిక్కెట్ ఇవ్వడం ఇష్టంలేని వారు కూడా జగన్ చెప్పినందున ఆయన వెంట ఉంటూ వచ్చారు. ఎన్నికలు అయిపోగానే వైఎస్సార్సీపీలోనే ఇంతియాజ్ కు ఎదరుగాలి మొదలైది.
సమర్థుడైన అధికారిగా...
ఇంతియాజ్ సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఈయన మామకు కర్నూలులో మంచి పేరు ఉంది. వైద్యుడిగా గుర్తింపు పొందటంతో ఆయన అభిమానులు ఇంతియాజ్ వెంట నడిచారు. కోవిడ్ సమయంలో ఇంతియాజ్ మామ చనిపోయారు. ఆయన భార్యకు కూడా కోవిడ్ వచ్చింది. అయినా విధి నిర్వహణలోనూ, అలాగే కుటుంబ వ్యవహారాలను చూసుకోవడంలోనూ వెనుకడుగు వేయలేదు. పాలనలో చూపిన చొరవను చూసిన జగన్ ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావించి ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అయితే ఇంతియాజ్ కు పార్టీ నేతల నుంచి కనీస సహకారం లేకుండా పోయింది.
సొంత పార్టీ వారి సహకారం లేకే..
సొంత పార్టీ వారి సహకారం ఇంతియాజ్ కు లేకుండా పోయింది. కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు రావాలంటే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఇంతియాజ్ తో కలిసి పనిచేయాలి. అయితే నగరంలోని ముఖ్య నాయకులైన మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్ వి మోహన్ రెడ్డిల సహకారం పూర్తిగా లేకుండా పోయింది. దీంతో ఇంతియాజ్ పార్టీలో ఉండికూడా ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉంటున్న బాలనాగిరెడ్డి నిత్యం కర్నూలులో ఉంటూ పార్టీని నడిపించే సత్తాలేదనేది కార్యకర్తల్లో ఉన్న వాదన. పైగా ఆయన మంత్రాలయం నుంచి కర్నూలుకు రోజూ వచ్చిపోవాలంటే ఇబ్బందిగానే ఉంటుందని అందువల్ల పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చాలని కొందరు వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్వి సుబ్బారెడ్డిలో నిలకడ లేకుండా పోయిందనే వాదన కూడా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూపులు ఉంటున్నాయని దాని వల్ల కూడా వైఎస్సార్సీపీకి నష్టం జరుగుతుందనే ప్రకారం వైఎస్సార్సీపీలో ఉంది.