ఇసుకలో కనిపించకుండా కాంట్రాక్టర్ల దోపిడీ!

ఇసుక క్వారీల నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇసుక తీసుకునే వారిని నుంచి భారీగా దోచుకుంటున్నారు. అది ఎలాగో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

Update: 2024-12-28 04:15 GMT

ఉచిత ఇసుక... ఇది పేరుకు మాత్రమే. క్వారీలో నుంచి బయటకు తీసే దగ్గర నుంచి ఇంటికి చేరే వరకు దూరాన్ని బట్టి ఇసుక వినియోగ దారులకు ఖర్చవుతోంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల నుంచి ఎక్కువగా ఇసుకను వినియోగ దారులు తీసుకెళుతున్నారు. విశాఖపట్నం వాసులు ఎక్కువగా గోదావరి ఇసుక వాడుతున్నారు. పెన్నా నది ఇసుకను ప్రకాశం జిల్లా వాసులు వాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో నదులు లేవు. పెన్నానది ఇసుకే దిక్కు. ప్రభుత్వం నిర్ణయించిన నదుల క్వారీల నుంచి ఆయా జిల్లాలు. పట్టణాలు, నగరాలు, గ్రామాల వారు ఇసుకను తీసుకుపోవాలి. కృష్ణా నది నుంచి ఇసుకను విజయవాడ పట్టణంలోని వారు వాడుకోవాలంటే ట్రాక్టర్ రూ. 1,800లు పడుతుంది. అయితే చాలా మంది ట్రాక్టర్ల వారు సిండికేట్ అయి రూ. 4,000లు తీసుకుంటున్నారు. అదేమిటంటే డీజిల్, ఎత్తుడు, దించుడు, తవ్వకం కూలీలు కలిపి అంత ఖర్చు అవుతుందని అంటున్నారు. పైగా ట్రాక్టర్లకు ఎటువంటి అనుమతులు కూడా అవసరం లేదు. ఒక్కో ట్రాక్టర్ కు మూడు టన్నుల ఇసుక పడుతుంది.

ఇసుక ఎక్కడి నుంచి తెచ్చినా స్టాక్ యార్డులో నమోదు చేయించాలట..

ట్రాక్టర్లలో ఎక్కడి నుంచైనా ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే ఏ నియోజకవర్గానికి చెందిన వారైనా ఇసుక సొంతంగా తెచ్చుకుంటే స్థానికంగా ఉన్న స్టాక్ పాయింట్ వద్దకు తీసుకొచ్చి తూకం వేయించి అక్కడి నుంచి తీసుకున్నట్లు నమోదు చేయించుకోవాలి. లేకుంటే ఆ నియోజకవర్గంలో ఎవ్వరూ ఇసుకను వాడుకునేందుకు అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న తీరును ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. నెల్లూరు పెన్నా నది నుంచి చాలా మంది ప్రకాశం జిల్లా వాసులు సొంతంగా ఇసుకను తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు దర్శిలో ఈ విధమైన దందా ఎక్కువైంది. ఇసుక తెచ్చుకున్న వారిని మైన్స్, కమర్శియల్ ట్యాక్స్ వారు పిలిపించి మీరు స్టాక్ పాయింట్ లో నమోదు చేయించుకుని తీసుకెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. చేసేది లేక వారు చెప్పినట్లు చేసి వారు చెప్పిన విధంగా స్టాక్ పాయింట్ లో డబ్బులు చెల్లిస్తున్నామని దర్శికి చెందిన సపకాని కొండయ్య వాపోయారు. టన్ను ఇసుక రూ. 1230లు తీసుకుంటున్నారు. తాము స్వయంగా తెచ్చుకుంటే రూ. 800లకే వస్తోందని తెలిపారు.

Delete Edit

అక్రమ దందాలోనూ కాంట్రాక్టర్లు భాగస్వాములు

చాలా మంది అక్రమంగా ఇసుక తీసుకెళుతున్నారు. అందుకు క్వారీల వద్ద ఉండే ప్రైవేట్ కాంట్రాక్టర్ల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువగా ఈ దందా లారీల్లో తరలించే ఇసుకలో జరుగుతోంది. సాధారణంగా లారీలో ఇసుక 20 టన్నులకు మంచి తీసుకెళ్ల కూడదు. అయితే లారీలో ఎత్తుకొనేటప్పుడే 32 టన్నుల వరకు ఎత్తు తున్నారు. లెక్క మాత్రం 20 టన్నులకే చూపిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వారు ఇసుక లారీలను తూకం వేసి అదనంగా తెచ్చిన ఇసుకను స్టాక్ పాయింట్ల వారు తెచ్చినట్లుగా నమోదు చేసుకుని ట్రాన్స్ పోర్టు చార్జీలను వేరుగా లాగుతున్నారు. అదనంగా తెచ్చిన ఇసుకకు కూడా తెచ్చుకున్న వారి నుంచి టన్నుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే రూ. 400లు ఎక్కువ తీసుకుంటున్నారు.

ట్రాన్స్ పోర్టు ఒకవైపు.. బిల్లు రెండు వైపులకు..

లారీల వారు వివిధ రకాల లోడ్ లు వేసుకుని సిటీలకు వెళుతుంటారు. సిటీల నుంచి గ్రామాలకు వెళుతుంటారు. లోడ్ దించిన తరువాత లారీ ఖాళీగా వెళుతుంటుంది. ఆ సందర్భాల్లో ఇసుక కావాల్సిన వారు లారీ బ్రోకర్లను సంప్రదిస్తారు. మాలారీ విజయవాడ వెళ్లింది. వచ్చేటప్పుడు ఇసుక లోడ్ తీసుకురావాలని చెబుతానని బ్రోకర్ చెప్పటంతో, ఇసుక తెచ్చుకునే సందర్భంలో ఒకవైపు ట్రాన్స్ పోర్టుకు బదులు రాను, పోను ట్రాన్స్ పోర్టు చార్జీలు నమోదు చేసి అందులో ఒకవైపు ట్రాన్స్ పోర్టు చార్జీల మొత్తాన్ని కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి సరుకుల లోడు వచ్చింది. తిరిగి విశాఖపట్నం వెళ్లేటప్పుడు గోదావరి నుంచి ఇసుకను తీసుకెళతారు. అప్పుడు ఒకవైపు ట్రాన్స్ పోర్టు చార్జీ మాత్రమే లారీల వారు తీసుకుంటారు. అయితే రాను, పోను చార్జీలు నమోదు చేసి ఇసుక తీసుకెళ్లే వారి నుంచి వసూలు చేసిన మొత్తంలో సగం లారీ వారికి ఇచ్చి మిగిలిన సగం కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఈ దందా సాగుతోంది. ప్రధానంగా కృష్టా, గోదావరి, పెన్నా నదుల్లోని ఇసుకలో ఈ దందా జోరందుకుంది.

Tags:    

Similar News