కన్న తల్లిని కర్రతో కొట్టి చంపాడు
మద్యానికి బానిసైన కొడుకే కన్న తల్లి పట్ల కాల యముడయ్యాడు.;
By : Admin
Update: 2025-03-10 13:47 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కొడుకు కాల యముడిగా మారాడు. పేగు తెంచి జన్మనిచ్చిన కన్న తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఎలాంటి కనికరం లేకుండా కర్రతో కొట్టి చంపేశారు. అత్యంత హృదయ విదారకమైన ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వివారాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళకు గురవయ్య అనే కొడుకు ఉన్నాడు. పుల్లమ్మ వయసు దాదాపు 75ఏళ్లు ఉంటాయి. పుల్లమ్మ కొడుకు గురవయ్య మద్యం తాగే అలవాటు ఉంది. ఆ అలవాటుతో గురవయ్య క్రమంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగందే ఉండలేని స్థితికి వెళ్లాడు. తాను మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు. ఆమె వద్ద డబ్బులు తీసుకొని పూటుగా మద్యం సేవించేవాడు. ఈ నేపథ్యంలో తన తల్లి పుల్లమ్మకు, కొడుకు గురవయ్యకు మధ్య చిన్న పాటి గొడవలు చోటు చేసుకునేవి.
ఈ క్రమంలో ఇదే రకమైన వాతావరణం సోమవారం కూడా చోటు చేసుకుంది. మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కొడుకు గురవయ్య, తల్లి పుల్లమ్మను వేధించసాగాడు. ఎలాగైన తల్లి వద్ద డబ్బులు తీసుకొని పూటుగా మద్యం సేవించాలని డబ్బుల కోసం తల్లిని మరింతగా వేధించసాగాడు. అయితే తల్లి పుల్లమ్మ కొడుకు గురవయ్యకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కొడుకు గురవయ్య కోపం కట్టలు తెంచుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు అడిగితే ఇవ్వవా అంటూ పక్కనే ఉన్న కర్రతో తల్లి పుల్లమ్మపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో తల్లి పుల్లమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు, స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన పుల్లమ్మను చికిత్స కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొడుకు గురవయ్య కొట్టిన దెబ్బలకు తాళలేక మార్గమద్యంలోనే తల్లి పుల్లమ్మ మరణించింది. దీంతో ఉయ్యాలవాడ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఉయ్యాలవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.