కొడుకా, జాగ్రత్త! మేమెళ్లి పోతున్నం!!
ఆ క్షణంలో ఆ వ్యాన్ అటు రాకుండా ఉంటే ఈ ఇంట పెళ్లి బాజాలు మోగేవే..;
By : The Federal
Update: 2025-09-10 03:55 GMT
ఆ క్షణంలో ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ పడి ఉంటారో ఊహించలేం. కొడుకు పెళ్లి చేసి సంబర పడాలనుకున్న ఆ అమ్మానాన్నల కోర్కె నెరవేరలేదు. కొడుకూ కోడల్ని ఆశీర్వదించి ఎన్నో జాగ్రత్తలు, మరెన్నో మెళకువలు చెప్పాలనుకున్న వాళ్ల ఆకాంక్ష సాకారం కాలేదు. ఆ స్కూటర్ ను ఆ వ్యాన్ ఢీ కొన్నప్పుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన ఈ కన్నవాళ్ల నోరు కదలాడుతుందే మాట బయటకు రాలేదు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామం వాళ్లది. దామినేని శ్రీనివాసరావు, రజనీకుమారి దంపతులు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు. కుమార్తెకు వివాహమైంది. ఇటీవల సాప్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించిన కుమారుడికి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. కొడుకు వివాహం ఘనంగా నిర్వహించాలని సంబరపడ్డారు. పెళ్లి పనులు ప్రారంభించారు. వివాహానికి ముందు తమ ఇంటి వద్ద ఉప్పలమ్మ తల్లికి పూజ నిర్వహించాలని అనుకున్నారు.
ఈ విషయంపై పూజారితో మాట్లాడేందుకు స్కూటర్ పై తక్కెళ్లపాడుకు వెళ్లారు. పూజారితో ముహూర్తం ఖరారు చేయించుకున్నారు. తిరిగి సొంతూరికి తిరిగి బయల్దేరారు. ఊరి మొగదల దాకా బాగానే వచ్చారు. గ్రామ శివారులో వీరి ద్విచక్రవాహనాన్ని కోళ్లను తీసుకువస్తున్న వ్యాను ఢీకొట్టింది. అనూహ్యంగా రహదారి ప్రమాదానికి గురై అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం నెలకొంది. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి చనిపోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఊరు ఊరంతా నీరుగారిపోయింది. కన్నీరుమున్నీరవుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.