రైతులకు సోలార్ డ్రయ్యర్ల తోడు

ధరలు తక్కువగా ఉండే పంటలను డ్రైచేసుకోవడం ద్వారా నిల్వ చేసి అమ్ముకునేందుకు సోలార్ డ్రయ్యర్లు రైతులకు ఉపయోగ పడుతున్నాయి.;

Update: 2025-08-20 11:55 GMT
సోలార్ డ్రైయ్యర్

ప్రకృతి విపత్తులతో పంట నాణ్యత దెబ్బతిన్నా.. మార్కెట్‌ ఒడుదొడుకులతో ధర భారీగా పడిపోయినా.. ఉత్పత్తి ఎక్కువగా ఉండి గిట్టుబాటు కాకున్నా.. రైతులకు నష్టాలే శరణ్యం. ఈ తరహా విపత్తుల నుంచి కర్షకులకు ఊరట కల్పించేలా అడుగులు పడుతున్నాయి. సోలార్‌ డ్రయ్యర్లను ఏర్పాటు చేసి పంటలకు విలువ జోడిస్తున్నారు. ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు పండిస్తున్నారు.


కొత్తూరు తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సోలార్ డ్రైయ్యర్లు

రైతుకు దన్నుగా...

పండ్లు, కూరగాయలు, పూలు, ఇతర ఏ పదార్థాలైనా కొన్ని రోజులే నిల్వ ఉంటాయి. అదే పదార్థాలను డ్రై చేస్తే ఆరు నెలలు నిల్వ ఉంటాయి. గిట్టుబాటు ధర లేనప్పుడు, తెగుళ్ల తాకిడికి.. నాణ్యతలేమితో అమ్ముడుపోనప్పుడు ఈ డ్రయ్యర్లతో ఎంతో ఉపయోగం. ఎండబెట్టడంతో ఆహార పదార్థాల పోషకాల్లో ఏ తేడా ఉండదు. మొదటి గ్రేడ్‌ పంట వెంటనే అమ్ముకుని కొంత నాణ్యత తక్కువ ఉన్న పంటలను డ్రై చేస్తే రైతులకు రెండు విధాలా ఆదాయం. విజయవాడ పరిసరాలే కాక.. కొత్తూరు తాడేపల్లి, ఉయ్యూరు, గుంటుపల్లి, ఆగిరిపల్లి తదితర ప్రాంతాల్లో 10కి పైగా సౌర డ్రయ్యర్లు నిర్వహిస్తున్నారు.


ఖండాంతరాలు దాటిస్తూ...

ఈ ఉత్పత్తులకు రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో డిమాండ్‌ బాగా ఉంది. ఇండోర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలే కాక... వివిధ దేశాల్లో కొన్ని కంపెనీలు డ్రయ్యర్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఉత్పత్తులు కొంటున్నాయి.

డ్రై చేసి ప్యాక్...

అమెరికా వంటి దేశాల్లో మైదాకు ప్రత్యామ్నాయంగా అరటి పౌడర్‌ను బేకరీల్లో వాడుతున్నారు. కూరల్లో చింత పండు బదులు పచ్చిమామిడి పొడిని (ఆంచూర్‌) వినియోగిస్తున్నారు. అరబ్‌ దేశాల్లో డ్రై చేసిన పూలకు డిమాండ్‌ ఉంది. అత్తర్లు, సుగంధ ద్రవ్యాల తయారీలో వాడుతున్నారు. మామిడి, అరటి, పనస, అరటి, అల్లం, మిరియాలు, కరివేపాకు, మునగాకు, గోంగూర, కొత్తిమీర, గులాబీలు, పసుపు తదితరాలను డ్రై చేస్తున్నారు. ఆకుకూరలను ఎండబెట్టి.. పొడిగా మార్చి ప్యాక్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు. మామిడి పండ్లతో తాండ్ర చేస్తున్నారు.

‘‘విదేశాల్లో తాజావి దొరుకుతున్నా ధర ఎక్కువ కావడంతో ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు సైతం డ్రై పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఒక 500 కేజీల సౌర డ్రయ్యర్‌ ద్వారా నెలకు రూ.10-15 వేలు ఆదాయం పొందవచ్చు.’’


డ్రై అవుతున్న ఉల్లిపాయలు

రాయితీతో చేయూత...

సౌర డ్రయ్యర్‌ ఏర్పాటుకు ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ 35 శాతం రాయితీ ఇస్తోంది. 500 కేజీల సామర్థ్య సౌర డ్రయ్యర్‌ ధర రూ.2.2 లక్షలు. ఇందులో 10 శాతం సొమ్ము చెల్లిస్తే 90 శాతం బ్యాంకు రుణం ఇస్తుంది. దీంతో యంత్రం సమకూర్చుకోవచ్చు. తర్వాత 35 శాతం రాయితీ సొమ్ము రూ.77 వేలు జమవుతుంది. పండ్లు, కూరగాయలు, పూల.. డ్రయింగ్‌కు ముందు నిల్వ చేయడానికి ఉద్యాన శాఖ శీతల గదులను 40 శాతం రాయితీపై అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ డ్రయ్యర్ల (సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు) కోసం ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్‌మెంట్ (ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ - APFPS) ద్వారా సబ్సిడీ రుణాలు అందుతున్నాయి. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) స్కీమ్ కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సబ్సిడీ వివరాలు: ప్రతి యూనిట్ ఖర్చులో 10 శాతం లబ్ధిదారుడు భరిస్తారు. 35 శాతం సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. (మొత్తం రూ. 29.4 కోట్లు), మిగిలినది బ్యాంకు రుణంగా (క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ) అందుబాటులో ఉంటుంది. మొత్తం పెట్టుబడి రూ. 84 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో PMFME కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,667 క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ రుణాలు మంజూరు అయ్యాయి. (మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ కోసం) 9,032 SHG సభ్యులకు సీడ్ క్యాపిటల్ అందింది. (రూ.34.15 కోట్లు). ఇందులో సోలార్ డ్రయ్యర్లు ఒక భాగం భాగం.


రైతులకు ఎలా ఉపయోగం

సోలార్ డ్రయ్యర్లు రైతులకు (ముఖ్యంగా చిన్న రైతులు మరియు SHGలు) ప్రయోజనకరంగా ఉంటున్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఎండబెట్టడంలో వాతావరణం, కాలుష్యం వల్ల నష్టాలు ఎక్కువ. సోలార్ డ్రయ్యర్లు సూర్యరశ్మిని ఉపయోగించి సమర్థవంతంగా ఎండబెట్టి, పంటలు (ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, నిమ్మ, మామిడి, అరటి మొదలైనవి) షెల్ఫ్ లైఫ్‌ను పెంచుతాయి.

ఎండబెట్టిన ఉత్పత్తులు ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఏర్పాటైన యూనిట్లలో మహిళలు నెలకు రూ. 12,000 నుంచి రూ. 18,000 ఆదాయం పొందుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ లేదా ఇంధనం అవసరం లేకుండా సౌరశక్తితో పనిచేస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.

ప్రతి యూనిట్ ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, రైతు కుటుంబాలకు ఉపయోగంగా ఉంటున్నాయి. రైతులు తమ పొలాల వద్దే ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రవాణా ఖర్చులు తగ్గుతాయి. తాజా ఉత్పత్తులు నేరుగా ప్రాసెస్ చేయవచ్చు.

మార్కెట్ ఉంటే మంచి వ్యాపారం: డ్రయ్యర్స్ యజమాని

సోలార్ డ్రయ్యర్స్ ఉపయోగంగానే ఉన్నాయి. మార్కెట్ ఉంటే బాగానే ఉంటుంది. స్థానికంగా ఉండే వారు డ్రై చేసిన వస్తువులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సోలార్ డ్రైయ్యర్ ల నిర్వాహకుడు దొడ్డపనేని వెంకటేశ్వరావు చెప్పారు. విజయవాడకు సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో 15 డ్రయ్యర్ల వరకు ఏర్పాటు చేశారు. ఆయన అనుభవాలు చెబుతూ రైతులకు సోలార్ డ్రయ్యర్లు బాగానే ఉంటాయని చెప్పారు. రైతులే కాకుండా ఇతరులు కూడా ఈ డ్రయ్యర్లు తీసుకుని పండ్లు, కూరగాయలు డ్రై చేయడం ద్వారా ఆ వస్తువుల ఆయువు పెరుగుతుందని, కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పీఎం ఎఫ్ఎంఈ పథకం కింద 35 సబ్సిడీతో ఇస్తుందన్నారు. బ్యాంకు రుణం పొందేందుకు కూడా అవకాశం ఉందని, అధికారులే దగ్గర ఉండి రుణాలు ఇప్పిస్తారన్నారు.

గతంలో విజయవాడలో ఈ రకమైన డ్రై ఐటమ్స్ కొనుగోలు చేసేందుకు రహేజా సోలార్ ఫుడ్స్ కంపెనీ ఉండేదని, వారు తమ నుంచి కొనుగోలు చేసే వారని చెప్పారు. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా సింగ్ నగర్ ప్రాంతం మునకకు గురికావడం వల్ల వారు ఇక్కడి నుంచి కంపెనీని ఎత్తివేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి కంపెనీ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉందని, అక్కడికి తీసుకు వెళితే వారు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేవలం మార్కెట్ ఇబ్బందుల కారణంగానే కాస్త వెనుకడుగు వేయాల్సి వస్తోందన్నారు.

తన వద్ద డ్రై చేసిన ఐటమ్స్ ను విదేశాల్లో ఉండే తమ బంధువులు, మరి కొందరు కొనుగోలు చేస్తున్నారన్నారు.

మార్కెటింగ్ సమస్య ఉంది: ఎన్టీఆర్ జిల్లా హార్టీకల్చర్ అధికారి

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ సోలార్ డ్రయ్యర్లు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా హార్టీకల్చర్ అసిసెంట్ డైరెక్టర్ పి బాలాజీ కుమార్ తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని వెంకటేశ్వరావు ఈ డ్రయ్యర్ల ద్వారా మంచి వ్యాపారం చేశారని, ప్రస్తుతం మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నరన్నారు. స్థానికంగా డ్రైచేసిన ఐటమ్స్ వైపు ప్రజలు పెద్దగా మొగ్గుచూపడం లేదని, కూరగాయలు, పండ్లు తాజాగా ఉన్నవి కొనుగోలు చేస్తున్నారన్నారు. తాజా కాయకూరలు, ఆకుకూరలు, పండ్లు వంటివి అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ డ్రయ్యర్లు చాలా ఉపయోగంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం సోలార్ డ్రయ్యర్ల నిర్వాహకులు విదేశాల్లోని వాళ్ల బంధువులు, ఇంకా తెలిసిన వారికి కావాల్సినవి సరఫరా చేస్తున్నారన్నారు. వ్యాపారం మంచిదైనా మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు.

Tags:    

Similar News