మంత్రి వర్గంలో ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం నిల్
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం లభించ లేదు. మిగిలన 20 జిల్లాలకు ప్రాతినిధ్యం లభించింది.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-15 04:26 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించ లేక పోయారు. శాసనసభ నియోజక వర్గాల సంఖ్యను బట్టి మంత్రి వర్గ సభ్యులను నియమిస్తారు. 175 శాసన సభ స్థానాలకు సంబంధించి 25 నుంచి 28 మధ్య మంత్రి వర్గ సభ్యులు ఉండొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలను కలుపుకొని మొత్తం 24 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 25 మంది మంత్రులుగా కొలువు దీరారు.
మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు
కడప, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు దక్క లేదు. ఈ ఆరు జిల్లాల్లో పార్టీకి మొదటి నుంచి సేవలు అందించిన సీనియర్ నాయకులు ఉండటం విశేషం. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సీనియర్లుగా ఉన్నారు. వీరిలో కనీసం ఇద్దరికైనా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఒక్కరికి కూడా అవకాశం దక్క లేదు. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్‌లు ఏదో ఒక రూపంలో తమకు కూడా మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని ఆశించారు. అయితే వారు ఎమ్మెల్యేలు కాక పోవడం, తిరిగి ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడానికి చాలా సమయం ఉండటంతో చంద్రబాబు వారికి అవకాశం కల్పించ లేక పోయారు.
17 జిల్లాల్లో ఒక్కొక్కరికే మంత్రి పదవి
చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నుంచి జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, ప్రకాశం జిల్లా కొండపి నుంచి బాలవీరాంజనేయులు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి గుమ్మిడి సంధ్యారాణి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత, కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేన నేత పవన్ కల్యాణ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, ఏలూరు జిల్లా నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి, అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలు మంత్రులుగా ఎంపికయ్యారు.
నాలుగు జిల్లాల్లో ఇద్దరిద్దరు
నాలుగు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మంత్రి వర్గంలో చోటు లభించింది. బాపట్ల జిల్లా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, ఇదే జిల్లా అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ (జనసేన), సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి ఎస్ సవిత, ధర్మవరం నుంచి వై సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు సిటీ నుంచి పి నారాయణ మంత్రులుగా నియమితులయ్యారు.
2014 లో మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పి నారాయణలు ఈ సారి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రులు కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డిలు కూడా మంత్రి పదవులు దక్కించుకోవడం విశేషం.