'తిరుమల లడ్డూపై 'సిట్' ఏమి తేలుస్తుందో...?
శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు సీనియర్ అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
By : SSV Bhaskar Rao
Update: 2024-09-24 16:59 GMT
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు అంటే..
సెప్టెంబర్ 18 :"తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు, చేప నేనె కలిసింది" అని సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని హిందువులు తీవ్ర ఆందోళన, వేదనకు గురయ్యారు. రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఇదిలావుంటే..
అదే రోజు సాయంత్రం: "గుజరాత్ లోని ఎన్డీడీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఆ విషయం ద్వారా స్పష్టమైంది" అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డి ఆ నివేదికను వెల్లడించారు. దీంతో శ్రీవారి భక్తులే కాదు. అన్ని వర్గాల్లో ఇదే చర్చనీయాంశమైంది. హిందూ సంఘాలు నిరసనలకు దిగాయి. దీనిపై రాష్ట్రంలో వైసీపీ, అధికార టీడీపీ కూటమి మధ్య రాజకీయ ఆరోపణలు, సవాళ్లు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి..
తిరుమల లడ్డూ వ్యవహారంపై సీట్ ఏర్పాటు చేయనున్నట్లు రెండు రోజుల క్రితం సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం సిట్ దర్యాప్తునకు తెరతీశారు. రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏరికోరి ఎంపిక చేశారు. ఇందులో సిట్ చీఫ్ కు సహకారానికి విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధనరాజును నియమించారు.
గతంలో సీవీఎస్ఓగా..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ లో కీలక అధికారిగా నియమితులైన గోపీనాథ్ జెట్టి గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ( సీవీ అండ్ ఎస్ఓ)గా కూడా పనిచేశారు. తిరుమలలో భద్రత ఏర్పాట్లతో పాటు ఇక్కడ జరిగే అన్ని వ్యవహారాలపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. తిరుమల శ్రీవారి వాహనసేవలతో పాటు లడ్డూ తయారీకి సంబంధించి క్షుణ్ణంగా తెలిసిన అధికారి. దీంతో సీట్ లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఈ ముగ్గురితో పాటు ఇంకొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కూడా నియమించనున్నారు.
టాస్క్ ఏమిటో..?
సిట్ కీలక అధికారులైన గుంటూరు నుంచి ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులైన గోపీనాథ్ జెట్టి, విజయరామరాజు సారధ్యంలో దర్యాప్తు సాగించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు దారి చేసింది. ఇందులో వారికి ఎలాంటి టాస్క్ ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. తిరుమల లడ్డు వ్యవహారంలో చోటుచేసుకున్న కల్తీ నెయ్యికి సంబంధించి వివరాలు సేకరించడంతోపాటు దీని వెనక సాగిన కథ, కమామిషు వారి సారథ్యంలో వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సాగించిన వ్యవహారాలపై దృష్టి సారిస్తారా? లేక అంతకుముందు కూడా తిరుమలలో నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించిన వ్యవహారాలను కూడా దర్యాప్తులో పరిగణలోకి తీసుకుంటారా? అనేది వేచిచూడాలి.
రంగంలోకి ఎప్పుడో..
తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఏర్పాటైన సిట్ అధికారులు ఎప్పటి నుంచి దర్యాప్తులోకి దిగుతారనే కూడా తెలియలేదు. ఈ చర్య వల్ల లడ్డూ వివాదం ఇంకొంతకాలం వార్తల్లో నిలిచే అవకాశం ఉంది. ఇదిలావుండగా,
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. "దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చడానికి సీబీఐకి అప్పగించాలి" అని మాజీ సీఎం వైఎస్. జగన్ తోపాటు టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశారు. ఇవన్నీ ఖాతరు చేయని రాష్ర్ట ప్రభుత్వం సిట్ ఏర్పాటుకే మొగ్గు చూపింది. దీనిపై సిట్ అధికారులు ఎలాంటి వ్యవహారాలు వెలుగులోకి తీసుకుని వస్తారనేది వేచిచూడాలి.