సింహపురి సీన్ తారుమారు..?

సింహపురి రాజకీయచిత్రం పూర్తిగా మారిందనే వాతావరణం కనిపిస్తుంది. టిడిపికి ఇక్కడ కూడా సీట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Update: 2024-05-12 17:14 GMT

తిరుపతి: సింహపురి రాజకీయాలు విలక్షణమైనవి. ఈ జిల్లాలోని రెడ్లందరూ శ్రీమంతులే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు మారిపోయారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అంచనాలు తారుమారైన పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్సిపి నుంచి ఓ రాజ్యసభ సభ్యుడు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల తిరుగుబాటు నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2019 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప తరహాలోనే నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్‌సిపి అభ్యర్థులే దక్కించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలు, నెల్లూరు అర్బన్‌లో ముస్లిం మైనార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మిగతా ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన శ్రీమంతులే పోటీలో ఉన్నారు. వారిలో ఐదు సీట్లు టిడిపి దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ స్థానం ఒకటి లేదా రెండు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు వెళ్లాయని చెబుతున్నారు. మిగతా ఐదు సీట్లలో ఒక ఎస్సీ రిజర్వుడు స్థానం కూడా వైఎస్ఆర్సిపికి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీకి సీట్ల సంఖ్య తగ్గవచ్చనే అభిప్రాయాన్ని కూడా ఓ అధికారి వ్యక్తం చేశారు.

నెల్లూరు ఎంపీ స్థానం నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా, ఆయనపై వైయస్సార్సీపి నుంచి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పోటీలో ఉన్నారు. వైఎస్సార్ సిపి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మినహా విజయసాయిరెడ్డి జిల్లాకు ఏమి చేశారనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సామాజికహిత కార్యక్రమాలు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనుకూలించే అంశాలతో పాటు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో కూడా పట్టు సాధించారని భావిస్తున్నారు.

కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్ నెల్లూరు నగరానికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారరెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి టిడిపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ పడుతున్నారు. ఆమెపై విమర్శలతో నల్లపురెడ్డి ప్రసన్న కుమారి కోరి కష్టాలు తెచ్చుకున్నారనే భావన ఉంది. ఇక్కడ మహిళలు కూడా ప్రశాంతి రెడ్డికి అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డితో వెంకటగిరి నుంచి తిరుగుబాటు చేసి వెళ్లిన సీనియర్ నేత, టిడిపి అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి నువ్వా, నేనా అన్నట్లు ఉంది.

 

నెల్లూరు రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టిడిపి అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధరరెడ్డి పోటీలో ఉన్నారు. ఈయనకు తమ్ముడు గిరిధర్ రెడ్డి పెద్ద బలం. నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై వేగంగా స్పందించే గుణం ఉన్న శ్రీధర్ రెడ్డికి సానుకూల పవనాలు వీస్తున్నట్లు చెబుతున్నారు. "మళ్లీ ఇక పోటీ చేయను" అనే సెంటిమెంటుతో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి సానుభూతి పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మళ్లీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డిపై పోటీ చేస్తున్నారు. వరుసగా ఓటమి చవిచూసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సానుభూతి ఉందని, మంత్రి కాకాని అనుచరులు సాగించిన దోపిడీ వల్ల మరక అంటించుకున్నారనే వాదన ఉంది. కంటైనర్ పోర్టు తరలిపోవడం కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి మైనస్‌గా చెబుతున్నారు.

వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో టిడిపి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు అన్ని రకాలుగా అనుకూల పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తిరుగుబాటు చేసి టిడిపి నుంచి ఆత్మకూరులో పోటీ చేస్తున్నారు. ఆయన వెంట రాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చేసిన నాయకులంతా టిడిపికి మద్దతు పలుకుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామకుమారరెడ్డి స్వపక్షం నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ తమకు లాభిస్తాయని టిడిపి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ధీమాగా ఉన్నారు.

ఉదయగిరి సెగ్మెంట్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది. టిడిపిలో చేరిన ఆయనకు కాకుండా ఎన్నారై కాకర్ల సురేష్ కు దక్కింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాలరెడ్డి పోటీ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో దగ్గరైన కాకర్ల సురేష్‌ను ఆదరిస్తారా? మేకపాటి వంశానికి ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందా అనేది చూడాలి. గూడూరు ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పాశం సునీల్ కుమార్ టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్సిపి మేరిగ మురళీధర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థికి వాతావరణం సానుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నారు.

మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం సూళ్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సంజీవయ్యకు పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నెల్లూరు అర్బన్ అసెంబ్లీ స్థానంలో నగర డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ పోటీలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉన్నప్పటికీ, టిడిపికి అన్ని రకాలుగా పరిస్థితులు కలిసి వస్తున్నాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News