సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప..!
By : Dinesh Gunakala
Update: 2024-10-06 09:10 GMT
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సింహ వాహనం – ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.
సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.