చంద్రగిరి వైఎస్ఆర్ సీపీకి ఎలాంటి షాక్ తగిలింది?
చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశాారా? టీడీపీ అభ్యర్థిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
By : SSV Bhaskar Rao
Update: 2024-07-27 17:47 GMT
"రాజకీయ ప్రతీకార హింసకు అవకాశం ఉండదు. అంతా చట్టప్రకారమే వ్యవహరిస్తాం" సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఆ మేరకు ఎన్నికల వేళ హింసాత్మక సంఘటనల్లో అరెస్టుల పర్వానికి చిత్తూరు జిల్లాలో తెరతీశారు.
మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోటరీలో కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం అందింది. పోలింగ్ తరువాత ఈవీఎంలు భద్రపరిచిన తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకుని, తిరుపతికి తీసుకుని వస్తున్నట్లు తెలిసింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని విజయం సాధించారు. ఆ వివరాలను పరిశీలిస్తే,
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నడులోని మాచర్లలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. సాధారణంగా ఈ గదులను పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజంట్ల ద్వారా పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కేంద్రం లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వెలుపల అమర్చిన ఎల్సీడీ టీవీల్లో చూసే వెసులుబాటు కల్పించారు.
ఏమి జరిగింది?
పద్మావతి విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను మే 14వ తేదీ పరిశీలించిన చంద్రిగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కారులో వెళుతున్నారు. అదే సమయంలో ఆయన సతీమణి సుధారెడ్డి తిరిగి వస్తున్నారు. ఆమె కొంతదూరం వెళ్లిపోయాక, అప్పటికే వైఎస్ఆర్ సీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్ట్రాంగ్ రూం వద్ద అనుచరులతో ఉన్నారు. కారుకు అడ్డుగా వచ్చిన పెద్ద సంఖ్యలో ఉన్న మోహిత్ రెడ్డి మద్దతుదారులు పులివర్తి నాని కారుపై దాడికి దిగారు. భారీ సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో పులివర్తి నాని గాయపడినా, కారు నుంచి దిగి, ప్రతిఘటించారు. అదేసమయంలో వెనుక కారు నుంచి దిగివచ్చిన నాని అంగరక్షకుడు ధరణి కూడా గాయపడ్డాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి గన్ మన్ ధరణి గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. పదుల సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు ఈ దాడులకు తెగబడ్డారని టీడీపీ కూటమి నేలు ఆరోపించారు.
ఈ సమాచారం అందుకున్న పులివర్తి నాని సతీమణి, వారి మద్దతుదారులు టీడీపీ నాయకులు తిరుపతికి చుట్టపక్కల విస్తరించి ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నేతులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో "వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మోహిత్ రెడ్డి మాట్లాడాడు. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పులివర్తి నానీని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
"నానిపై దాడి జరగలేదు. వాహనాలపై దాడి జరిగింది. దీనిని ఖండిస్తున్నా" అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. "పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదు. అదంతా పెద్ద నాటకం" అని కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, మద్దతుదారులు అకారణంగా వేధిస్తే "వడ్డీతో సహా చెల్లిస్తా" అని కూడా హెచ్చరించారు.
పదుల సంఖ్యలో అరెస్ట్
పద్మావతి వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సిట్ ఏర్పాటైంది. ప్రస్తుత డీఎస్పీ రవిమనోహరాచారి సారధ్యంలో తిరుపతి, చంద్రగిరిలో విచారణ జరిగింది. ఆ సమయంతో కాస్త కోలుకున్న పులివర్తి నాని, స్టేషన్ కు వచ్చి ఘటన వివరాలు తెలపడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించారు. అంతకుముందు...చంద్రగిరి టీడీపీ అభ్యర్థి (ప్రస్తుతం ఎమ్మెల్యే) పులివర్తి నానిపై జరిగిన దాడి తరువాత నిందితులను అరెస్టు చేయడంలో తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. "2019 ఎన్నికల సమయంలో కూడా దాడులు జరిగాయి. సాక్ష్యాలు ఇవ్వలేకపోయాం. అందుకే ఈ ఎన్నికల కోసం మా కార్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం" అని చెప్పారు. ఆమె మాటలతో అంతా ఆశ్యర్యపోయారు. ముందుజాగ్రత్తలతో సిద్ధంగా ఉన్నారనే రహస్యం బయటికి తెలిసింది. దాడి సందర్బంగా రికార్డు అయిన వీడియోలు పోలీసులకు ఇచ్చినా, చర్యలు లేవు" అంటూ ధర్నా, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించడంతో పోలీసులు కదిలారు. దీంతో దాడికి పాల్పడిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులు భానుకుమార్, గణపతిరెడ్డితో పాటు కొందరిని అరెస్ట్ చేశారు. మరుసటి రోజు 13 మందిని రిమాండ్ కు పంపారు. ఆ తరువాత 34 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. ఆయన అరెస్టు జరగలేదు. ఇటీవల కొన్ని రోజుల కిందటి వరకు ఆయన ముందస్తు బెయిల్ కోసం విఫలయత్నం చేశారని సమాచారం. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకుని వస్తున్నట్లు సమాచారం.
అకారణంగా ఇరికించారు..
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడిలో కేసుతో సంబంధం లేని వారిని ఇరికించారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. తిరుమలలో పని చేసుకుంటున్న, తన కుమారుడిని అరెస్ట్ చేశారని ఓ తల్లి, చంటిబిడ్డను చంకన వేసుకుని పోలీసు వాహనంలో రిమాండ్ కు తరలుతున్న ఆ వ్యక్తి భార్య కన్నీటి వేదన మాటలకు అందని భావం కల్పించింది.