వైఎస్‌ర్‌కి వారసుడివా.. బీజేపీకి దాసుడివా!

సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. అవినాష్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇచ్చినందుకే తాను కడప బరిలో దిగుతున్నానని ప్రకటించారు.

Update: 2024-04-06 10:23 GMT

సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. ‘‘నువ్వు బీజేపీకి దాసుడివా వైఎస్‌ఆర్ వారసుడివా’’ అంటూ పూతలపట్టులో జరిగిన ‘న్యాయ యాత్ర’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. షర్మిల నోట వచ్చిన వాఖ్యలు విపరీతార్థమొచ్చేలా ఉన్నాయని రాజకీయ పెద్దలు అంటున్నారు. అయితే పూతలపట్టులో జరుగుతున్న ‘న్యాయ యాత్ర’ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ మరికిన్నా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్.. రాష్ట్రంలోని ముస్లింలకు సమాధానం చెప్పాలని, వారికి వైసీపీ హయాంలో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్‌ఆర్ వారసుడు ఎలా అవుతాడు

ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల ఇద్దరూ రెండు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ రాజకీయ వారసులు ఎవరు అవుతారు అన్న అంశం కొంతకాలంగా చర్చల్లో నిలుస్తూ వస్తోంది. ఈ అంశంపై ఈరోజు జరిగిన యాత్రలో షర్మిల స్పందించారు. బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ‘‘వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకమే. కులాలు, మతాల పేరుతో ప్రజల్లో చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ. వైఎస్‌ఆర్ కొడుకు జగన్ ప్రస్తుతం బీజేపీ దాసుడిగా మారి ఉన్నారు. గోద్రాలో దాడులు జరిగినప్పుడు జగన్ మౌనముద్రలోకి వెళ్లారు. అలాంటి బీజేపీకి దాసుడిగా ఉన్న జగన్.. వైఎస్ రాజశేఖర్ వారసుడు ఎలా అవుతారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో చేతులు కలిపిన జగన్.. రాష్ట్ర ద్రోహి కాదా’’అని ప్రశ్నించారు.

ముస్లింలకు కాంగ్రెస్‌తోనే న్యాయం

రాష్ట్రంలోని ముస్లింలందరికీ వైఎస్ జగన్ సమాధానం చెప్పి తీరాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘‘ఎన్నికల సమయంలో వారికి ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారం వచ్చిన తర్వాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు సీఎం జగన్. ఇమామ్‌లకు రూ.15 వేలు వేతనం, ముస్లింలకు ప్రత్యేక బ్యాంక్, ముస్లిం చనిపోతే రూ.5లక్షల బీమా ఇలా చెప్పుకుంటూ పోతే అంతు అనేదే లేదు. కానీ వాటిలో నెరవేర్చినవి సున్నా. ముస్లిం ఓటర్లకు న్యాయం జరిగాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యం. ఎన్నికల సమయంలో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ కూడా ఎన్నెన్నో కల్లబొల్లి కబుర్లు చెప్తారు. అధికారం వచ్చాక అన్నీ మారుస్తారు. కానీ కాంగ్రెస్ అలా కాదు. ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పదు’’అని ప్రజలకు హామీ ఇచ్చారు.

బీజేపీ మోసం తప్ప ఏం చేసింది

ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేయడం తప్ప బీజేపీ ఏం చేసిందని షర్మిల ప్రశ్నించారు. ‘‘విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తామని అప్పట్లో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. కానీ ఏం చేశారు. ఏమీ చేయలేదు. ప్రత్యేక హోదాపై మోసం చేశారు. అప్పటి వరకు ఇస్తామని.. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వచ్చాక మాట దాటేశారు. కడప స్టీల్ ఎందుకు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్ట్‌కు ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన చేశారు. దీనికి శంకుస్థాపన చేయడమే ఒక ప్రాజెక్ట్ మారిపోయింది. ఇంత జరుగుతున్నా వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. పార్లమెంటుకు వెళ్లి నిద్రపోతున్నారా? కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారైన ‘కడప స్టీల్’ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? కడప-బెంగళూరు మధ్య రైల్వే లైన్ రావాలన్నది వైఎస్ఆర్ ఆశయం. కానీ దాన్ని వద్దని జగన్ అన్నారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై సీబీఐ.. నిందితుడి ముద్ర వేసింది. అలాంటి వ్యక్తికి సీఎం జగన్ మరోసారి కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. బాబాయి హత్య కేసులో సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారు. అందుకు అసలు కారణం దాచేస్తున్నారు. అవినాష్‌కు మళ్లీ టికెట్ ఇచ్చినందుకే కడప బరిలోకి నేను దిగాను. కడప ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్ లెక్క సేవ చేస్తా’’అని ప్రజలకు హామీ ఇచ్చారామే.




Tags:    

Similar News