హంతకులు అసెంబ్లీకి వెళ్లకూడదనే పోటీ: షర్మిల

కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్నారు. జనన్నను ఓడిస్తేనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

Update: 2024-04-05 07:03 GMT


‘‘హంతకులు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతోనే ఎన్నికల బరిలో తలపడటానికి సిద్ధమయ్యాను’’అని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర అభివృద్ధి జరగాలన్నా.. హత్యా రాజకీయాలకు చరమగీతం పాడాలన్నా జగనన్నను చిత్తు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లా ఆమగంపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్రలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కడప నుంచి పోటీ చేయడానికి గల కారణాన్ని వివరించారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు అంత సులభం కాదని, కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. అనంతరం సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్.. నా అనుకున్న వాళ్లను నాశనం చేశారంటూ మండిపడ్డారు.


‘‘నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి షెల్టర్ కల్పించారు. తాను అండగా ఉంటూ వాళ్లను కాపాడుతున్నారు. అలా చేయడం ద్వారా హత్యా రాజకీయాలకు దన్నుగా నిలిచారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌కు టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాను. అలాంటి హంతకులు చట్టసభల్లో అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతోనే పోటీకి సిద్ధమయ్యాను. హంతకుడు అవినాష్‌ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం. దాన్ని సాధించి తీరుతాను’’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


అది చిన్నాన్న కోరిక


‘‘ 2019 ఎన్నికల్లో కూడా చిన్నాన్న హత్యను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారు. నేను ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న కోరిక. ఆయన కోరికను నెరవేర్చడానికి, నా లక్ష్యాన్ని సాధించడానికే ఎన్నికల బరిలో నిలుస్తున్నా. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి. హంతకులను తరిమి కొట్టండి. హంతకులకు కాపాడటానికి అధికారాన్ని వినియోగించడం దుర్మార్గం కాదా? ఈసారి కడప ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ రాజశేఖర్ బిడ్డ, మరోవైపు వైఎస్ వివేకాను హత్య చేయించిన అవినాష్ ఉన్నారు. ధర్మం కోసం ఒకవైపు నేను ఉంటే మరోవైపు ధనంతో అధికారాన్ని కొనేయాలని అనుకునే వ్యక్తి ఉన్నారు. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలి. చట్టసభలకు ధర్మం వెళ్లాలా హత్యలు చేయించే కిరాతకులు వెళ్లలో మీరే తేల్చండి’’అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు షర్మిల.

bbbbb

ఈ సందర్బంగానే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ పూర్తి మద్దతును షర్మిలకు ఇవ్వాలని కోరారు. ‘‘నా తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోంది. అందులో షర్మిలను ఎంపీగా గెలిపించి ధర్మాన్ని కాపాడుకోవాలి. అవినాష్ రెడ్డిని చిత్తు చేయాలి. షర్మిలను ఎంపీగా చూడటం నాన్న ఆఖరికి కోరిక. ఆయనను హత్య చేయించిన వారిని ఆదరించొద్దు’’అని పిలుపునిచ్చారు.



Tags:    

Similar News