వైసీపీకి షర్మిల ఛాలెంజ్.. పులివెందులలో తేల్చుకుందామా!
పులివెందులలో నిర్వహించిన ‘న్యాయ యాత్ర’లో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల వస్తే వివేకాను ఎవరు చంపారో తేలుద్దామంటూ సవాల్ చేశారు.
By : S Subrahmanyam
Update: 2024-04-12 13:41 GMT
ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల దూకుడు కనబరుస్తున్నారు. సీఎం జగన్‌పై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ‘‘పులివెందులకు వస్తే వైఎస్ వివేకాను ఎవరు చంపారో తేల్చుకుందాం’’ అంటూ ఈరోజు పులివెందులలో జరిగిన ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆమె ఛాలెంజ్ చేశారు. అయితే ఈ ప్రచార యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల ప్రచార కార్యక్రమంలోకి వచ్చిన వైసీపీ కార్యకర్తలు జగన్‌కు అనుకూలంగా వైసీపీ జెండాలు ఊపడం ప్రారంభించారు. జగన్‌కు అనుకూల నినాదాలు కూడా చేశారు. వారికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా నినాదాలు చేస్తూ జెండాలను ఊపడం ప్రారంభించారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఈ పరిస్థితులను ముందుగా నిలువరించారు. అనంతరం షర్మిల తన యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో ఆమె ప్రసంగిస్తూ.. అవినాష్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతో రాత్రిళ్లు నిద్ర కూడా పోవట్లేదంటూ చురకలంటించారు.
సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు
ఓడిపోతానన్న భయం పట్టినందుకే మా పర్యటనలను అడ్డుకోవడం, జెండాలను తొలగించడానికి అవినాష్ రెడ్డి.. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారామే. ‘‘నేను ఒకప్పుడు జగన్‌కి చెల్లెలు కాదు.. బిడ్డను. సీఎం అయిన తర్వాత జగన్ ఎవరో నాకు తెలియదు. ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. బాబాయిని చంపిన వ్యక్తిని పక్కనబెట్టుకుని కాపాడుతున్నాడు. మళ్లీ వాళ్లకే కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర దుస్థితికి సంబంధించిన అంశం. ప్రజా నాయకుడైన వివేకాను హతమార్చిన విషయం. అవినాష్ అంటే నాకు ఇదివరకు ఎప్పుడూ కోపం లేదు. అతడు హంతకుడిని సీబీఐ తేల్చడం, చిన్నాన్న హత్య వెనకున్న చీకటి రహస్యాలు తెలియడంతో అవినాష్ అంటే కోపం పెరిగింది. తనవాళ్లనే హతమార్చిన వ్యక్తులను జగన్ అక్కున చేర్చుకుంటున్నారు. హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదన్నదే నా ఆశయం. అందుకే కడప బరిలో నిలబడుతున్నా. ఈ ఎన్నికల్లో న్యాయం, ధర్మం ఒకవైపు ఉంటే అన్యాయం, హంతకులు మరోవైపు ఉన్నారు. నాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసే వారు పులివెందులకు రండి. పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేలుద్దాం. నన్ను గెలిపిస్తే వైఎస్ఆర్ మాదిరిగా ప్రజా సేవ చేస్తా. మీ గొంతు ఢిల్లీలోని గల్లీల్లో ప్రతిధ్వనించేలా చేస్తా. మీ సమస్యలను నా సమస్యలుగా పోరాడతా. పరిష్కారం తీసుకొస్తా’’అని ఆమె ప్రజలకు భరోసా కల్పించారు.
హంతకులను కాపాడటం న్యాయమా!
‘‘తమనేదో ఉద్దరిస్తారని నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని హంతకులను కాపాడటానికి వాడుతూ ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. అవినాష్ రెడ్డి హంతకుడని సీబీఐ తేల్చింది. దాన్ని నిరూపించడానికి సీబీఐ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ సాక్షాత్తు సీఎం తన అధికార బలాన్ని అడ్డుపెట్టి హంతకులకు రక్షణగా నిలుస్తున్నారు. మీరు చెప్పండి.. హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తావ్? హంతకులను కాపాడు ఏం సాధిస్తారు? ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదు. ఇలాంటి వారికి మీరే బుద్ధి చెప్పాలి’’అని ప్రజలు ఉద్దేశించి అన్నారామే.
అభివృద్ధి శూన్యం
అనంతరం వైఎస్ సునీత రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ‘‘కరువు సీమకు నీళ్లు తీసుకురావడం ముఖ్యం కాదా? అందుకోసం సీఎం ఏం కృషి చేశారో ప్రజలకు చెప్పాలి. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఐదేళ్లలో మీకు ఏం వచ్చింది. రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది అన్న అంశాలను బేరీజు వేసుకోండి. ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోండి. ధర్మం గెలవాలంటే షర్మిలకు ఓటు వేయండి’’అని ప్రసంగించారు.