లైంగిక దాడేమో కాని మీడియాపై కేసు నిజం

బాలికపై లైంగిక దాడి అని ప్రచారం జరిగింది. ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. ఇంకొందరి వాట్సప్ అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Update: 2024-11-04 12:54 GMT

నాలుగేళ్ల పాపపై హత్యాచారం ఘటన మరువకనే.. మరో అకృత్యం వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ లోనే పంచాయితీ నడిపించారు. అని ఓ టీవీతో పాటు, సోషల్ మీడియాలో ఆదివారం రాత్రి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై పోలీసులు సోమవారం స్పందించారు. అసలు తమ పోలీస్ స్టేషన్ లో అలాంటి పంచాయతీనే జరగలేదు అని ఎస్ఐ చెబుతున్నారు. "మా కుటుంబ పరువు బజారుకీడ్చారు" అంటూ ఓ దళిత మహిళ ఫిర్యాదుతో మీడియా ప్రతినిధిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో బాధ్యులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు వెంకటగిరి సీఐ తెలిపారు. వివరాల్లోకి వెళితే...

నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా)లోని వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం కడగుంట గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రచారం చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాలికను తినుబండారాలు తీసిస్తానని తీసుకుని వెళ్లిన తొమ్మదో తరగతి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విని నానమ్మతో పాటు బంధువులు రావడంతో ఆ విద్యార్థి, పారిపోయినట్లు వార్తలు ప్రసారం చేయడంతో పాటు వాట్సప్ గ్రూప్లో పోస్టు చేశారు. దీనిని ఓ పత్రిక డిజిటల్ ఎడిషన్లో కూడా ప్రచురించింది.
ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రలు బాలాయపల్లె పోలీస్ స్టేషన్ కు వెళితే, కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో పాటు పెద్దమనుషులుగా రంగప్రవేశం చేసిన ఓ సర్పంచ్, నలుగురు నేతలు పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ పెట్టారని కూడా ఆ మీడియాలో ఆరోపించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులతో బేరం కూడా పెట్టారని, రోజంతా పంచాయతీ చేసి, బాధిత బాలిక కుటుంబానికి రూ. 30 వేలు చెల్లించే విధంగా తీర్మానం చేశారనేది ఆ వార్తల సారాంశం. దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 
కేసు నమోదు

జరగని ఘటనను జరిగినట్లు ప్రచారం చేసి మా కుటుంబ పరువు తీశారంటూ, బాలాయపల్లె మండలం కడగుంట గ్రామానికి చెందిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా బిడ్డ జీవితంపై మరక వేసేలా కథన ప్రసారం చేశారు. మా కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీశారని ఆ దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. "మా కుటుంబ పరువుకు భంగం కలిగించారు. అవమానించే విధంగా వార్తలు ప్రచారం చేశారు. వారి ఛానల్ TRP రేటింగ్‌ పెంచే ప్రయత్నంగా ఉన్నాయి" అనే ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో వెంకటగిరిలోని ఐ న్యూస్ ఛానల్ రిపోర్టర్ శ్రీనుపై సోమవారం ఉదయం 353 (2), 352, 196, 351 (2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద 89/2024 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలాయపల్లె ఎస్ఐ మధు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ' ప్రతినిధికి తెలిపారు. 

Tags:    

Similar News