ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం తీవ్ర వడగాల్పులు

శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 41డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.;

By :  Admin
Update: 2025-03-15 13:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మార్చిలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం, సోమవారాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్చి 16 ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దాదాపు 45 మండలాల్లో ఈ వడగాల్పు ప్రమాదం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం జిల్లాలో 16 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.

మార్చి 17 సోమవారం 34 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 171 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 12, పార్వతీపురం మన్యంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నంలో 1, అనకాపల్లిలో 14, కాకినాడలో 13, కోనసీమలో 7, తూర్పు గోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 14, కృష్ణాలో 9, ఎన్టీఆర్‌లో 8,
గుంటూరులో 12, బాపట్లలో 1, పల్నాడులో 24, ప్రకాశం జిల్లాలో 5 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని తెలిపారు.
ఇక శనివారం ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడులో 41.8డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు 41.7డిగ్రీలు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7డిగ్రీలు, వైఎస్సార్‌ జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41డిగ్రీలు, చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. శనివారం 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 54 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్‌ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్‌ సూచించారు.
Tags:    

Similar News