తెల్లవార్లు విచారణ..జైలుకు జోగి సోదరులు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు, ఆయన సోదరుడు జోగి రాముకు రిమాండ్ విధించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) నాయకుడు జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు సోదరుడు జోగి రాముకు కూడా ఇదే రిమాండ్‌ను విధించిన న్యాయమూర్తి, వీరిద్దరినీ విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఎక్సైజ్ శాఖ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) అధికారులు జోగి రమేశ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అరెస్టు తర్వాత జోగి రమేశ్, జోగి రామును విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి సుమారు 12 గంటలపాటు తీవ్రంగా విచారించారు. సిట్ అధికారులు వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి ప్రశ్నించడంతో పాటు, ప్రధాన నిందితుడు అడ్డేపల్లి జనార్దనరావు (ఎ1)తో వారి సంబంధాలపై ఆరా తీశారు. జనార్దనరావు మునుపటి విచారణల్లో ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం, 2023లో జోగి రమేశ్ మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ఉత్పత్తిను ప్రోత్సహించారని, ఆర్థిక సహకారం అందించారని పేర్కొన్నారు. జనార్దనరావు, తనకు రూ.3 కోట్ల వరకు నష్టాలపై ఆయన హామీ ఇచ్చారని కూడా చెప్పారు. ఈ వాంగ్మూలాలు రికార్డు చేశారు. అలాగే ఆక్టోబర్ 23న జనార్దనరావు జోగి రమేశ్ నివాసాన్ని సందర్శించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సిట్ సేకరించింది.
వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు జోగి రమేశ్, జోగి రామును న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన వాదనలు సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగాయి. న్యాయమూర్తి రిమాండ్ విధించేందుకు ముందు, జోగి రమేశ్ తనపై మొదలైన కేసులు రాజకీయ పక్షపాతంతో జరుగుతున్నాయని వాదించారు. అయితే, ఎస్‌ఐటీ అధికారులు జనార్దనరావు వాంగ్మూలాలు, ఆధారాలు ఆధారంగా రిమాండ్ అవసరమని వాదించారు.
ఈ అరెస్టు ముందు, జోగి రమేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు CBI దర్యాప్తి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ డీజీపీకి ఫిర్యాదు చేస్తూ, TDP-కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రేరేపిత IVRS క్యాంపెయిన్‌ల ద్వారా ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తోందని ఆరోపించింది. ఆ మేరకు డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. జోగి సోదరుల అరెస్టుపై వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. "ఇది అక్రమమైన, అవినీతి పూరిత రాజకీయ ప్రతీకార చర్య. పట్టుబడిన నకిలీ మద్యం మీ పార్టీ వాళ్లకు, మీకు చెందినది, మీ నాయకులు, పార్టీ బెల్ట్ షాపులకు సంబంధించినది. మా BC నాయకుడిని అరెస్టు చేసి మీ పాపాలు దాచాలని చూస్తున్నారు" అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.