'సరస్వతీ' షేర్ల వివాదంలో తల్లీ, చెల్లికి ఎదురుదెబ్బ – జగన్‌కు ఊరట
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది;
By : Amaraiah Akula
Update: 2025-07-29 10:03 GMT
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ 2024 సెప్టెంబర్ 3న వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఆయన కోరారు.
తాను, తన భార్య భారతి పేరిట ఉన్న షేర్లను మళ్లీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తిరిగి చేర్చాలని జగన్ అభ్యర్థించారు.
జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘గిఫ్ట్’ గడువు పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. పిటిషన్‌లపై తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తదితరులు కోరారు.
వైఎస్ జగన్ పిటిషన్‌పై పది నెలలపాటు విచారణ జరిగింది. ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ విచారణ జరిపి రెండు వారాల కిందట తీర్పు రిజర్వ్ చేశారు. చివరకు.. జగన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ జూలై 29న తీర్పు ఇచ్చారు. మంగళవారం నాడు హైదరాబాదులోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్మానించింది. ఈ పిటిషన్‌లో, తనకు, తన భార్య భారతికి చెందిన 'సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్' కంపెనీలోని షేర్లను అక్రమంగా తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మల పేరిట మార్చుకున్నారని, వాటిని రద్దు చేయాలని జగన్ కోరారు.
"జగన్‌మోహన్ రెడ్డి పిటిషన్‌ను అనుమతించారు. ఉత్తర్వుల ప్రతికోసం వేచి చూస్తున్నాం. ఇరుపక్షాలకు కొన్ని సూచనలు ఉన్నాయి కూడా. షేర్ల మార్పిడి అక్రమమని జగన్‌మోహన్ రెడ్డి వాదించిన పిటిషన్‌కు అనుమతి లభించింది," అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ తరఫున న్యాయవాది వై. సూర్యనారాయణ తెలిపారు.
ఇక వైఎస్ షర్మిల తరఫున న్యాయవాది కె. దేవీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ ఉత్తర్వుపై అపిలేట్ ట్రిబ్యునల్ లేదా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని తెలిపారు.
సరస్వతి పవర్‌లో జగన్ 74.26 లక్షల షేర్లు (29.88 శాతం), భారతి 41 లక్షల షేర్లు (16.30 శాతం), విజయమ్మ 1.22 కోట్ల షేర్లు (48.99 శాతం) కలిగి ఉన్నారు. మిగతా వాటా క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉంది.
తన సోదరి వైఎస్ షర్మిలతో సంబంధాలు చెడిపోయిన తర్వాత మాజీ సీఎం ఈ షేర్ల వివాదంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.