విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, మోర్టాలిటీ రేటు కూడా తక్కువగా ఉందని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డాక్టర్ అర్చన మజుందార్ తెలిపారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా మొదటి రోజు మంగళవారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని, వన్ స్టాప్ సెంటర్ ను, మహిళా వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్చన మజుందార్ మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో మూడు రోజుల పాటు పర్యటించి మహిళలకు పనిప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పరిశీలిస్తామన్నారు. ఈ రోజు పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలు పరిశీలిస్తే చాలా బాగున్నాయని, ఇంకా చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సరిచేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావుకు సూచించానన్నారు.
ఆసుపత్రి పరిసరాలు హైజీనిక్ గానే ఉన్నాయన్నారు. మహిళలకు వార్డుల్లో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని, రోజువారీ బెడ్ షీట్స్ కూడా మారుస్తున్నారన్నారు. మహిళల భద్రత, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. డాక్టర్స్ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ, మంచి టీమ్ వర్క్ తో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి లైగింక వేధింపులపై సిబ్బందిలో అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాలని సూపరిండెంట్ కు తెలియజేయగా ఇప్పటికే కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఆ కమిటీ మూడు నెలలకు ఒకసారి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు..
మహిళలను లైంగికంగా వేధింపులకు ఏమైనా గురిచేస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారు ఉపయోగించే టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అని అధికారులను అడిగి తెలుసుకోవడంతోపాటు స్వయంగా పరిశీలించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పేషెంట్స్ కు, సిబ్బందికి సూచించారు. డాక్టర్స్ డ్యూటీ రూములు, పీజీ డాక్టర్ల సేఫ్టీ, డ్యూటీ సమయాల్లో సౌకర్యాలు వారిని అడిగి తెలుసుకున్నారు. మాకు సౌకర్యాలు బాగానే ఉన్నాయని పీజీ డాక్టర్లు తెలిపారు. బాలికలు, మహిళల రక్షణ కోసం, వారి సాధికారత కోసం మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉపయోగపడే వన్ స్టాప్ సెంటర్ ను సభ్యులు పరిశీలించి బాధితులతో భేటీ అయ్యారు. అక్కడకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన వసతి, సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డొమెస్టిక్ వైలెన్స్, పోక్సో కేసులు, అట్రాసిటీ కేసులపై జాతీయ మహిళా కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు.