వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటితో నెల్లూరు 'లేడి డాన్'కి సంబంధమేమిటీ?
నిడిగుంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.;
By : The Federal
Update: 2025-08-26 04:42 GMT
నెల్లూరు 'లేడీ డాన్'గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆమె ఆర్ధిక మూలాలు మొదలు రాజకీయ, అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందలకొద్దీ ఫొటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అరుణకు ఎవరు వెన్నుదన్నుగా నిలిచారు? ఆమె ఎవరెవర్ని బెదిరించారు? తదితర అంశాల గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన రెండేళ్ల కాల్ డీటెయిల్ రికార్డులు (సీడీఆర్) తెప్పించి విశ్లేషించారు.
తాజాగా, ఆమెకు ‘కిరాయి హత్యల’ చరిత్ర ఉందని ఒకప్పుడు అరుణకు సహకరించిన పోలీసు బాసులే చెబుతున్నారు. సూళ్లూరుపేటలో జరిగిన ఒక హత్యతో ఆమెకు లింకులు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
సూళ్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్యని, ఆ హత్య చేయించింది ఈ లేడీ డాన్ అరుణ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుపారీ ఇచ్చిన వ్యక్తి ప్రస్తుత ఎన్జీఏ కూటమి నాయకుల్లో ఒకరని, ఈ సంగతి బయటపడే అవకాశం ఉండడంతో గుండెనొప్పి సాకుతో నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
మరోపక్క, నిడిగుంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతోనూ, మండలాధ్యక్షుడు, వైసీపీ మండల కన్వీనర్ అనిల్‌కుమార్ రెడ్డితోనూ ఆమె సన్నిహితంగా మెలిగేవారని తెలుస్తోంది. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఫోటోలు బయటపెడుతున్నారు.
గత ఎన్నికల సమయంలో అరుణ సూళ్లూరుపేట నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆమెకు అనిల్‌కుమార్ రెడ్డి జనరల్ ఏజెంటుగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు కేటాయించగా.. 494 ఓట్లు వచ్చాయి. సంజీవయ్య నివాసం, వ్యాపారాలూ రెండూ నెల్లూరులోనే. అనిల్ కుమార్‌రెడ్డి సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడు. వారిద్దరికీ అరుణ నెల్లూరులోనే పరిచయమైంది.
2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచీ అరుణ సూళ్లూరుపేటలో విస్తృతంగా పర్యటించారు. కొందరు రౌడీలతో ముఠా కట్టి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆ క్రమంలోనే ఓ బిల్డర్ ను బెదిరించారని, ఇప్పుడా వ్యక్తి పెట్టిన కేసు మేరకు అరుణను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
చెప్పిన మాట వినలేదని కేసు పెట్టించారా!
‘గంజాయి వ్యాపారం చేయండి.. వ్యభిచార కేంద్రం నిర్వహించండి.. అన్నీ నేను చూసుకుంటా’’ అంటూ అరుణ జారీ చేసిన ఆదేశాలు పాటించనందుకు తనను కేసులో ఇరికించారని రాయపు శ్రీనివాసులు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన శ్రీనివాసుల కథనం మేరకు... వెంకటగిరి ప్రాంతానికి చెందిన భాగ్యరాజు... శ్రీనివాసులకు బంధువు. భాగ్యరాజు అరుణను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అరుణతో శ్రీనివాసులుకు పరిచయం ఏర్పడింది. గంజాయి సరఫరా చేస్తానని, వ్యభిచార కేంద్రం నిర్వహించాలని.. ఏదైనా తేడా వస్తే తాను చూసుకుంటానని శ్రీనివాసులుకు ఆమె ఆఫర్ ఇచ్చింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇలాంటి వాటిలోకి రాలేనని చెప్పడంతో అతడిపై కక్ష పెంచుకుంది. పడుగుపాడులో రాజ్యలక్ష్మి అనే మహిళతో వివాదం తలెత్తడంతో అరుణ ఆమె ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టింది. రాజ్యలక్ష్మి, ఆమె భర్తతోపాటు శ్రీనివాసులుపైనా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణా జరపకుండానే ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇన్నాళ్లూ భయంతో నోరుమెదపని శ్రీనివాసులు... సోమవారం పోలీసులకు అరుణపై ఫిర్యాదు చేశాడు.
రౌడీషీటర్ శ్రీకాంత్‌కు నోటీసు
ఇదెలా ఉండగా, విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ, రౌడీషీటర్, నిడిగుంట అరుణ ప్రియునిగా చెబుతున్న అవిలేల శ్రీకాంత్‌కు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ నోటీసు జారీ చేశారు. నెల్లూరు జైలులో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ను వైద్యం నిమిత్తం తిరుపతి ఆస్పత్రిగా పంపగా అరుణతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో శ్రీకాంత్‌కు నోటీసు పంపారని విశాఖ జైలు సూపరింటెండెంట్ సాయిపవన్ తెలిపారు.
నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించిట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడామె నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.