డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు పూర్తి ఏర్పాట్లు

అభ్యర్థులకు ఎలాంటి సమ్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌ బాష అధికారులను ఆదేశించారు.;

Update: 2025-08-25 16:13 GMT

డీఎస్సీ నియామక ప్రక్రియలో తొలి అడుగు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం మెరిట్‌ జాబితా విడుదల చేసినప్పటికీ ఎంపిక జాబితాను ఇంతవరకు పెట్టలేదు. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవడంతో రాష్ట్ర విద్యాశాఖ ఎట్టకేలకు ఈనెల 28వ తేదీ గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ కు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో వెరిఫికేషన్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ భాష పరిశీలించారు. 

సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస బీఎడ్‌ కాలేజీ రాఘవేంద్ర బీఎడ్‌ కాలేజీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. డీఎస్సీ వెరిఫికేషన్‌ కేంద్రాలకు సర్టిఫికేట్ల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అభ్యర్థులు ఏ చిన్న సమస్య ఎదుర్కొనడానికి వీల్లేదని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్, విద్యుత్‌ సదుపాయాలకు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సబ్జెక్టు వారీగా ఏర్పాటు చేసిన గదులను కలియదిరిగిన ఆయన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎంతమంది హాజరుకానున్నారు, ఏ ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలి, వాటిలో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అనే అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2600 అభ్యర్థులు ఎంపికయ్యారని సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం 54 బృందాలను ఏర్పాటు చేశామని అదనంగా మరో కొన్ని బృందాలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ శ్యామ్యూల్‌ పాల్‌ జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషకు వివరించారు. ఎంపిక జాబితా రాష్ట్రం నుంచి విడుదల కావలసిన నేపథ్యంలో ఏ క్షణాన వెరిఫికేషన్‌ కు ఆదేశాలు అందుతాయో వెంటనే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని డిఇఓ వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆదేశించారు. నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల ధ్రువీకరణ కీలకమైనదని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు.
సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ అభ్యర్థులకు పర్సనల్‌ లాగిన్‌ కు ఎంపిక వివరాలు అందుతాయని డీఈవో పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కేంద్రాల్లో హెల్ప్‌ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ కు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు టీ అబ్రహం, ప్రతాపరెడ్డిలు డిఈఓ శామ్యూల్‌ పాల్‌ తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. వీరితోపాటు నంద్యాల డిఈవో జనార్దన్‌ రెడ్డి, ఎంఈఓ శ్రీధర్‌ బాబు, డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ చౌడేశ్వరి, డీఎస్సీ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:    

Similar News