శ్రీవారి ఆలయానికి తాళం వేసిన సన్నిధిగొల్ల

వేంకటేశ్వరస్వామికి 12 గంటల సుదీర్ఘ విశ్రాంతి. తిరుమలలో అరుదైన దృశ్యాలపై కథనం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-07 14:31 GMT
మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం నేపథ్యంలో టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. ఆదివారం ఏకాంతసేవ పూర్తి చేసిన వేదపండితులు ఆగమశాస్ర్త ప్రకారం సన్నిధిగొల్ల రమేష్ బంగారు వాకిలికి తాళం వేయడంతో ఆలయ మూసివేత ప్రక్రియ పూర్తయింది.

తిరుమల శ్రీవారికి కొన్ని సంవత్సరాల తరువాత సుదీర్ఘ విశ్రాంతి దక్కింది. 2021 అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం 15వ తేదీ వేకువజామున 2.25 గంటల వరకు ఏర్పడింది. ఆ తరువాత ఈ రోజు అంటే (2025 సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం) కూడా సుదీర్ఘ చంద్రగ్రహణం రెడ్ మూన్ ఏర్పడబోతోంది.

నిర్మానుష్యంగా మారిన శ్రీవారి ఆలయం

తిరుమల ఆగమ పండితులు మాత్రం రాత్రి 9.50 గంటల నుంచి ఎనిమిదో తేదీ వేకువజామున 1.31 గంటల వరకు ఉంటుందని నిర్ధారించారు. దీంతో గ్రహణానికి ఆరుగంటల ముందే అంటే తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలన్నీ మధ్యాహ్నం 2.15 గంటలకు మూసేవేశారు. తిరిగి ఎనిమిదో తేదీ సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికుల కోసం తిరుమలలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ విద్య శాఖాధికారి పురుషోత్తం కథనం ప్రకారం

"ఆదివారం రాత్రి 8.55 గంటలకు ప్రారంభమయ్యే సంపూర్ణ చంద్రగ్రహణం సోమవారం వేకువజామున రెండు గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత చంద్రుడు గ్రహణం నుంచి సాధారణ స్థితికి వస్తారు" అని పురుషోత్తం చెప్పారు.

శ్రీవారి చెంత సన్నిధి గొల్ల

తిరుమల శ్రీవారి ఆలయంలో వందల సంవత్సరాలుగా ఆచార, వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో శ్రీవారి మొదటి దర్శనం సన్నిధి గొల్లకు మాత్రమే దక్కుతుంది. తిరుమల మాడవీధిలోని అర్చక భవనం నుంచి వేదపండితులను వెంట తీసుకుని వెళ్లే సన్నిధి గొల్ల శ్రీవారి సన్నిధిలోని బంగారు వాకిలికి వేసిన తాళాలు తాకించి అర్చకులకు అందిస్తారు. ద్వారాలు తెరవగానే నిలువెత్తు శ్రీవారి దివ్యమంగళ స్వరూప దర్శనం సన్నిధి గొల్లకు మాత్రమే దక్కుతుంది. దివిటీ వెలుగులో సన్నిధిలోకి వెళ్లే సన్నిధి గొల్ల దీపాలు వెలిగించడం ద్వారా అర్చకులు, పరిచాకరకులు శ్రీవారి సన్నిధిలోకి వెళ్లడానికి మార్గం చూపించడం అనే ప్రక్రియ వందల, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం.

వెండివాకిలి వద్ద...

ఆదివారం మధ్యాహ్నం కూడా అర్చక భవనం, బేడి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని పెద్దజీయర్ స్వామి మఠం నుంచి ప్రతినిధులను సన్నిధిగొల్ల శ్రీవారి ఆలయం వద్దకు తీసుకుని వెళ్లారు. శ్రీవారికి ఏకాంతసేవ అనంతరం బంగారువాకిలి వద్ద సన్నిధిగొల్ల తాళం వేశారు. అనంతరం వెండివాకిలి, మహద్వారానికి తాళాలు వేయడం ద్వారా శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసి వేశారు.

అరుదైన దృశ్యం: శ్రీవారి ప్రధాన ఆలయ మహద్వారం మూతపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, అధికారులు


 


ఆ తాళాలు ఓ పెట్టలో ఉంచి మరో తాళం వేశారు. ఆ తాళం టీటీడీ అధికారుల వద్ద ఉంటుంది. తాళాల గుత్తి ఉన్న చెక్కపెట్టెను తీసుకుని వెళ్లిన సన్నిధిగొల్ల జీయర్ స్వామి మఠంలో అప్పగించారు. సోమవారం తిరిగి ఆ పెట్టెను తీసుకుని వస్తారు. ఆ పెట్టకు వేసిన తాళాన్ని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ తెరుస్తారు. ఆ తరువాత పెట్టెలోని తాళాల గుత్తిని తీసుకునే సన్నిధిగొల్ల ఆలయ ద్వారాలను తాకించి, ఇచ్చిన తరువాతే అర్చకులు తాళం తీస్తారు. దీంతో మళ్లీ శ్రీవారి దర్శనాలు ప్రారంభం అవుతాయి.

శ్రీవారికి సుదీర్ఘ విరామం

తిరుమల శ్రీవారికి సుదీర్ఘ ఏకాంతం దక్కింది. సాధారణంగా సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు శ్రీవారికి నిత్య పూజలు అందిస్తుంటారు. అలాగే వీఐపీలతో పాటు, సామాన్య యాత్రికుల దర్శనం కోసం ఆలయం తెరిచే ఉంటుంది. రోజుకు కనీసంగా 70 వేల నుంచి 80 వేల మందికి దర్శనాలు కల్పించడంలో టీటీడీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఆదివారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే 27,525 మంది దర్శించుకున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 82,188 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీవారికి ఏకాంతసేవ ఆలస్యమయ్యే వాతావరణం ఏర్పడింది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో రోజూ రాత్రి 12 గంటలకు ఏకాంతసేవ (పవళింపుసేవ), తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకు మేల్కొలుపు (సుప్రభాత సేవ) నిర్వహించాలి. ఆ రెండు సేవల్లో గుడి తాళాలు తీయడంలో సన్నిధి గొల్లదే ప్రధానపాత్ర. కాగా, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో శ్రీవారికి కనీసం అర్ధగంట కూడా విశ్రాంతి అంటే ఏకాంతం లేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు శ్రీవారి ప్రధాన ఆలయం గొల్లమండపం వద్ద ఓ రోజు రాత్రంతా నిరీక్షించింది.
" ఏకాంతసేవ, సుప్రభాత సేవకు కనీసం అర్ధగంట కూడా విరామం లేని పరిస్థితి కనిపించింది" అందుకు కారణం యాత్రికుల సంఖ్య పెరగడమే అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
"సామాన్య యాత్రికులకు మంచి దర్శనం చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెబుతున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారికి దాదాపు 12 గంటల పాటు విశ్రాంతి లభించింది. సోమవారం ఉదయం మూడు గంటల తరువాత దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన చెప్పారు.
అధికారుల పర్యవేక్షణ
చంద్రగ్రహణం వల్ల తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయడాన్ని అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పర్యవేక్షించారు. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభం అవుతాయని బీఆర్. నాయుడు మీడియాకుచెప్పారు. అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తామన్నారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పిఏసి–2, వైకుంఠం వంటశాలలు మూసి వేసినట్లు తెలిపారు. యాత్రికుల కోసం 50 వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశామని వారు వివరించారు. కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్నప్రసాదం డిప్యూటీ ఈఓ రాజేంద్ర, విజిఓ సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా మూసివేశారు. ఆగమశాస్త్రానికి అనుగుణంగా తిరుమల తరహాలోనే ఆలయ ద్వారాలను మూసివేశారు.
Tags:    

Similar News