వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు కేసుపై కీలకమైన సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు కస్టడీ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. "చట్టం ముందు అందరూ సమానమే" అన్న సూత్రాన్ని గుర్తు చేస్తూ ఆయన ప్రభుత్వానికి, వ్యవస్థలకు ట్విట్టర్ వేదికగా కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ఆ మేరకు సునీల్ కుమార్ బుధవారం ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు.
పోస్ట్‌లోని ప్రధానాంశాలు
తన సస్పెన్షన్‌పై కూడా సునీల్ కుమార్ ప్రస్తావించారు. గతంలో రఘురామ కృష్ణరాజు కస్టడీలో హింసకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో, అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న తనను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని కూడా సునీల్ కుమార్ ప్రస్తావించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో తనను సస్పెండ్ చేయడం మంచిదేనని ఆయన పేర్కొన్నారు.
పదవుల నుంచి తొలగించాలి
దర్యాప్తు న్యాయంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే కేవలం తనను సస్పెండ్ చేస్తే సరిపోదని.. ఫిర్యాదుదారుడైన రఘురామ కృష్ణరాజును కూడా ఆయన ప్రస్తుత పదవుల (డిప్యూటీ స్పీకర్) నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం: రఘురామ కృష్ణరాజు ఉన్నత రాజ్యాంగ పదవిలో కొనసాగడం వల్ల సీబీఐ (CBI) దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆ పోస్టులో సునీల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం చట్టవిరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు: "చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ముందు అందరూ సమానమే" అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే.. రఘురామను కూడా పదవి నుంచి తప్పించాల్సిందేనని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
నేపథ్యం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టయిన రఘురామ కృష్ణరాజు, కస్టడీలో తనను పోలీసులు వేధించారని, కొట్టారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పీవీ సునీల్ కుమార్ ఇతర పోలీస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. చట్టం అందరికీ ఒకేలా ఉండాలని ఒక ఐపీఎస్ అధికారి నేరుగా డిప్యూటీ స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం, రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
’దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి‘ అని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.